సాలీడు భరతం పట్టిన బాలుడు

17 Oct, 2019 14:17 IST|Sakshi

చిన్నపిల్లలకు చీమ కుట్టినా ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుగా భయపడిపోతుంటారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే అది పొరపాటే. ఇక్కడ చెప్పుకునే బుడతడు భయపడటం సరి కదా.. ఎవరైనా భయపెట్టాలని చూసినా ఊరుకోడు. ఓరోజు ఆ పిల్లవాడు హాలోవీన్‌ ఉత్సవానికి వెళ్లాడు. అక్కడ సాధారణం కన్నా పెద్ద సైజులో ఉన్న సాలీడు కనిపించింది. ఆదుర్దాగా దాని దగ్గరికి వెళ్లి తల నిమిరాడు. ఒక్క క్షణంలో ఉన్నపళంగా సాలీడు పైకి లేచి బాలుడిని భయపెట్టింది. దీంతో అతన్ని భయపెట్టాలనుకున్న ప్రాణికి బుద్ధి చెప్పాలనుకున్నాడు.

వెంటనే ఆ సాలీడుపై పిడిగుద్దులు కురిపించాడు. దాని తల పట్టి లాగుతూ భరతం పట్టాడు. ఇక్కడ విశేషమేమంటే అది నిజమైన సాలీడు కాదు. ఎలక్ట్రానిక్‌ బొమ్మ.ఇక ఈ తతంగాన్నంతా మెక్‌కార్మిక్‌ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘బుడతడు సాలీడును ఇష్టపడ్డాడు కానీ, భయాన్ని కాదు’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘వీడు పిల్లోడు కాదు.. పిడుగు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఏమవుతాడో!’ అంటూ మరొకరు ఫన్నీ కామెంట్‌ చేశారు. ఇక అతని ధైర్యానికి సోషల్‌ మీడియా నీరాజనాలు కురిపిస్తోంది.

మరిన్ని వార్తలు