హెచ్‌–1బీ భాగస్వాములకు ఊరట

4 Mar, 2018 02:48 IST|Sakshi

ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై నిర్ణయం వాయిదా

జూన్‌ వరకు ఏ నిర్ణయమూ తీసుకోబోమన్న డీహెచ్‌ఎస్‌

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ యంత్రాగం వెల్లడించింది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయ్యింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. ‘హెచ్‌–4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై జూన్‌ వరకు ఏ నిర్ణయం తీసుకోం. ఈ నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు హెచ్‌–1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది.

2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్యలు/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్‌–4 డిపెండెంట్‌ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పించింది. దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి తొలగిస్తామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పుడు హెచ్‌–4 వీసాదారుల తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదని అందుకు కొద్దిగా సమయం పడుతుందని తాజాగా ట్రంప్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో గణనీయమైన మార్పులు చేయాలని.. వాటిని ఆర్థికపరంగా కూడా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. ఇందుకు మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు