ఉగ్రవాది సయీద్‌కు షాకిచ్చిన పాక్‌ కోర్టు

12 Feb, 2020 17:39 IST|Sakshi

హఫీజ్‌ సయ్యద్‌ను దోషిగా తేల్చిన పాక్ కోర్టు

ఉగ్రవాద నిధుల కేసులో 11 ఏళ్ల  జైలుశిక్ష

ఇస్లామాబాద్‌ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌లో యాంటీ టెర్రరిజమ్‌ కోర్టు (ఏటీసీ) షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్‌పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్‌ హుస్సేన్‌ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  

గతంలో హాఫీజ్‌ 16 సార్లు అరెస్ట్‌ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్‌.. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్‌ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు.

మరిన్ని వార్తలు