ముస్లిం ప్రపంచం నుంచి ప్రతిఘటన తప్పదు

22 Dec, 2017 17:25 IST|Sakshi

లాహోర్‌ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌.. అమెరికాపై మరోసారి విషంకక్కాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన హఫీజ్‌.. అమెరికాపై రాజకీయ వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా జెరూసలేంపై అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది పాలస్తీనా భవిష్యత్‌ను  ప్రశ్నార్థకం చేస్తుందని ధ్వజమెత్తాడు. 

జమాతే ఉద్‌ దవా, లష్కే తోయిబా ఉగ్రవాద సంస్థల వ్యవస్థాపకుడైన హఫీజ్‌... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై గతంలోనూ విరుచుకుపడ్డాడు. తాజాగా జెరూసలేంపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఆమెరికాను పాకిస్తాన్‌ సహా అన్ని ముస్లిం దేశాలకు శత్రువుగా పరిగణిస్తామని చెప్పాడు. ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తించడం అనేది మధ్యప్రాచ్యం, మొత్తం ప్రపంచాన్ని అస్థిరతకు గురి చేస్తుందన్నాడు. ఈ క్రమంలో మొత్తం ముస్లిం ప్రపంచం పాలస్తీనాకు అండగా నిలుస్తాయని.. అవసరమైతే యుద్ధం చేసేందుకైనా సిద్ధమని హఫీజ్‌ అమెరికాను హెచ్చరించాడు.

ఇజ్రాయిల్‌ అనేది ఒక క్యాన్సర్‌ వ్యాధి అని.. ఈ రోగం దాదాపు అర్ద శతాబ్దం నుంచి పాలస్తీనా ముస్లింలను పీడిస్తోందని అన్నాడు. ఒక్క ఇజ్రాయిల్‌ వల్ల మొత్తం ప్రపంచమంతా అస్థిరత్వంలో పడుతోందన్నాడు. పాలస్తీనా ముస్లింలపై ఇజ్రాయిల్‌ ప్రయోగించిన రసాయన ఆయుధాల గురించి ప్రపంచం మర్చిపోయిందని.. ముస్లిం ప్రపంచానికి ఇంకా ఆ విషయం గుర్తుందని హఫీజ్‌ సయీద్‌ చెప్పాడు. 

మరిన్ని వార్తలు