శవాల దిబ్బ... హైతీ

9 Oct, 2016 06:48 IST|Sakshi
శవాల దిబ్బ... హైతీ

900 దాటిన మరణాలు
సాయం కోసం 10 లక్షల మంది ఎదురుచూపులు
నేడు జరగాల్సిన ఎన్నికలు వాయిదా

జెరెమి(హైతీ): తిండి, నీళ్లు లేక వీధుల్లోనే  బతుకు వెళ్లదీస్తున్న పది లక్షల మంది ప్రజలు... ధ్వంసమైన ఇళ్ల ముందే సాయం కోసం పడిగాపులు! ఇదీ మాథ్యూ తుపాను ధాటికి అస్తవ్యస్తమైన హైతీ పరిస్థితి.. చేతికి రావాల్సిన పంటలు కూడా పెనుగాలులకు కొట్టుకుపోయాయి. మరోపక్క..  మాథ్యూ తుపాను దెబ్బకు 400 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించగా.. మృతుల సంఖ్య మాత్రం రెట్టింపుగా ఉంది. గంట గంటకూ శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికితీస్తూనే ఉన్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం మృతుల సంఖ్య 900కు పైమాటే. ఒక్క జిల్లాలోనే 470 మంది మరణించినట్లు సమాచారం.

దేశ దక్షిణ ప్రాంతంలో 30 వేల ఇళ్లు నేలమట్టంగా కాగా... 150 మంది ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు ప్రకటించగా... అంతకు ఐదు రెట్లు నష్టం ఉండవచ్చని అంచనావేస్తున్నారు.  మూడు రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి స్తాయి నష్టం అంచనాలు మొదలేకాలేదు. ప్రస్తుతం హైతీలో తాత్కాలిక ప్రభుత్వం ఉండడంతో సహాయ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలడంతో రోడ్లు ఎక్కడికక్కడ మూసుకుపోయాయి. దీంతో బాధితుల్ని రక్షించే ప్రక్రియకు, నష్టం అంచనాకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. దక్షిణ ప్రాంతంలోని కుగ్రామంలో 82 మంది మృతిచెందడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

1963లో హరికేన్ ఫ్లోరా ధాటికి 8 వేల మంది మరణించిన తర్వాత ఇదే అతిపెద్ద నష్టం. కొన్ని గ్రామాల్లో 90 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి.  దేశ రాజధాని పోర్ట్-ఔ-ప్రిన్స్ నష్టం నుంచి తప్పించుకున్నా... దక్షిణ ప్రాంత పట్టణాలు, గ్రామాలు భారీ విధ్వంసాన్ని చవిచూశాయి. ఏడాదిగా ఘర్షణలు, పరస్పర దాడులతో అట్టుడుకుతున్న హైతీలో ఆదివారం ఎన్నికలు జరగాల్సి ఉండగా తాజా ఉత్పాతంతో అవి వాయిదాపడ్డాయి. స్కూళ్లు, పోలీసు స్టేషన్లు, ఓటింగ్ కేంద్రాలు నేలమట్టమవడంతో హైతీలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితే లేదు.  కలరా వ్యాధి ఎప్పుడు ఏ విపత్తు ముంచుకోస్తోందనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. హైతీకి ఆదుకునేందుకు అమెరికన్లు స్పందించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తి చేశారు.

దక్షిణ కరోలినాలో ‘మాథ్యూ’ కుండపోత అమెరికాలో ఐదుగురి మృతి
మయామీ: అమెరికాలో మాథ్యూ తుపాను శనివారం తీరం తాకింది. దక్షిణ కరోలినాలోని చార్లెట్సన్ నగరానికి 48 కి.మీ.దూరంలోని మెక్ క్లెల్లాన్‌విల్లే వద్ద గంటకు 120 కి.మీ వేగంతో తీరం తాకింది. తుపాను తీవ్రతను కేటగిరి 1కు తగ్గించారు. దక్షిణ కరోలినా లో కుంభవృష్టి కురిసింది.ఉత్తర కరోలినా వైపు పయనిస్తోన్న మాథ్యూ  అక్కడా వరదలు ముంచెత్తవచ్చని అంచనా. తుపాను వల్ల ఐదుగురు చనిపోయారు. ఫోరిడాలో  10 లక్షల మంది అంధకారంలోనే గడిపారు. జార్జియాలో 5 లక్షల మంది, దక్షిణ కరోలినాలో 4.37 లక్షల మంది చీకట్లోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు