హైతీ ప్రజలు మట్టి రొట్టెలు తింటున్నారా!

30 Jun, 2018 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను లేదా పెంకులను ఆవురావురుమని ఎలా తింటున్నారో చూడండి! అంటూ గత రెండు రోజులుగా ఓ వీడియో వివిధ ‘వాట్సాప్‌’ గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది. ‘మనం వదిలేసే తిండి కూడా దక్కని దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న ఇలాంటి ప్రజలను చూసైనా మీరు వృథాచేసే తిండిని సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అనే సందేశంతో ప్రముఖ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌ కూడా ఆ వీడియోతో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వీడియో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. మొదటి సారి 2009, ఫిబ్రవరిలో, రెండోసారి 2013, జూలైలో, మూడవ సారి 2016లో వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. 

అంత దీనావస్థలో ఉన్నారా? ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను తింటున్నారా? 
చారిత్రకంగా హైతీని ఆఫ్రికా దేశం అనేకంటే ఆఫ్రో–కరీబియన్‌ దేశమంటే బాగుంటుంది. స్విడ్జర్లాండ్‌ కన్నా ఈ దేశంలో కొండలు ఎక్కువ. అందుకే దీనికి హైతీ అనే పేరు వచ్చింది. హైతీ అంటే స్థానిక భాషలో ఎత్తయిన కొండలని అర్థం. దీన్ని అన్ని విధాల అష్టకష్టాల కూడలి అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలకు ప్రకృతి అనుకూలించకపోగా అనూహ్యంగా ఉంటుంది. ఎప్పుడు తుపానులు విరుచుకుపడతాయో, ఎప్పుడు భూప్రకంపనలు ప్రకోపిస్తాయో ఎవరికీ తెలియవు. ఇక్కడి ప్రజల ప్రధాన వత్తి వ్యవసాయమైనా, వ్యయసాయానికి దేశంలోని 12 శాతం భూమే అనుకూలమైనది. మరో 31 శాతం భూమి కాస్త వ్యవసాయానికి అనుకూలమైనా పంట చేతికొచ్చేవరకు నమ్మకం ఉండదు. చుట్టూ ఆక్రమించిన సముద్రపు అలల కోతలు ఎక్కువ.
 
54 శాతం భూమి ఎత్తయిన పండ్ల తోటలకు అనుకూలమని గతంలో అమెరికా వ్యవసాయ శాఖ ఓ సర్వేలో తేల్చింది. ఏయే పండ్ల తోటలను వేసుకోవచ్చో కూడా సూచించింది. అయితే వాటిని హైతీ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తున్నదో తెలియదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు. సముద్రం ఆటుపోట్లు లాగానే రాజకీయ సంక్షోభాలు ఎక్కువ. అందుకని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. 

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం హైతీలో జాతీయ దారిద్య్రం శాతం 58.6. పోషక ఆహార లోపాల వల్ల ఏటా వెయ్యి మందికి 53 మంది పిల్లలు మరణిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి పరంగా 230 దేశాల్లో దీని స్థానం 146. 2010లో వచ్చిన ‘మాథ్యూ హరికేన్‌’, దాని వెన్నంటి వచ్చిన భూకంపం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది మరణించారు. ఇప్పటికీ బాధితులు టార్పోలిన్‌ టెంట్లలోనే తలదాచుకుంటున్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో బతకలేక దేశ రాజధాని ‘పోర్ట్‌ ఔ ప్రిన్స్‌’ నగరానికి ఎక్కువగా వలసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మట్టి రొట్టెలను తినే అలవాటు ఉంది. వీటిని స్థానిక భాషలో ‘గలెట్టి’ అని, ఇంగ్లీషులో మడ్‌ కేక్స్‌ అని మడ్‌ కుకీస్‌ అని పిలుస్తున్నారు. 

సముద్రపు ఒడ్డున దొరికే గోధుమ వర్ణపు మెత్తటి బంక మట్టిని తీసుకొచ్చి దానికి కొంత ఉప్పు కలిపి రొట్టెల్లా చేసి ఎండ పెడతారు. వాటిని పిల్లలు, పెద్దలు మన గారెల్లా కొర్కుక్కు తింటారు. ఆ మట్టిలో వివిధ ఖనిజాలు ఉండడం వల్ల వాటిని ఇలా తిన్నట్లయితే కడుపు పేగుల్లోని క్రిములన్నీ చనిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని వారి నమ్మకం. మొదట్లో గర్భవతులు, ముసలి వాళ్లు వాటిని తినేవారు. డబ్బున్న వారు కూడా మన ఆయుర్వేద వైద్యంలా అప్పుడప్పుడు వాటిని తినేవారు. ఇప్పుడు పేద ప్రజలందరు వాటినే తింటున్నారు. కేవలం వారు బతకడం కోసమే తింటున్నారు. 

మట్టి రొట్టెల్లో పోషక పదార్థాలు ఉన్నాయనుకోవడం వారి ఆత్మ సంతప్తి కోసమే. ఆ మట్టిలో వివిధ రకాల ఖనిజాలు ఉన్నప్పటికీ పిల్లలకు, పెద్దలకు అవసరమైనన్ని పోషక పదార్థాలు లేవని ఐక్యరాజ్య సమితి ఇదివరకే తేల్చింది. ఉంటే 52 శాతం హైతీ పిల్లల్లో పోషక పదార్థాల లోపం ఎందుకుంటుందని కూడా ప్రశ్నించింది. 

మరిన్ని వార్తలు