-

అరగంటలో న్యూయార్క్‌కు!

1 Oct, 2017 09:01 IST|Sakshi

‘బీఎఫ్‌ఆర్‌’ అనే భారీ రాకెట్‌తో సాధ్యమే.. గంటలో భూమిపై ఎక్కడికన్నా వెళ్లొచ్చు.. 

స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెల్లడి 

2024 కల్లా అందుబాటులోకి..

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌ నుంచి కూకట్‌పల్లికి వెళ్లాలంటే ఎంత టైమ్‌ పడుతుంది.. ట్రాఫిక్‌ జామ్‌ వంటివి ఏవీ లేకుంటే కొంచెం అటుఇటుగా అరగంట. అంతేనా.. మరి ఇదే అరగంటలో మీరు హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు వెళ్లిపోగలిగితే.. అబ్బో.. అద్భుతంగా ఉంటుందిగానీ ఎలా సాధ్యమని అనుకుంటున్నారా.. ఇంకొన్నేళ్లు ఆగితే దీన్ని సుసాధ్యం చేస్తానంటున్నారు ఎలాన్‌ మస్క్‌! 

ఎలాన్‌ మస్క్‌.. టెస్లా పేరుతో విద్యుత్‌ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టినా.. స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ సీఈవోగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాను తయారు చేసిన రాకెట్లతో ఇంధనాన్ని, వ్యోమగాములను రవాణా చేసినా.. హైపర్‌లూప్‌ పేరుతో గంటకు 1,300 కి.మీ. వేగంతో గొట్టాల్లో ప్రయాణించే సరికొత్త రవాణా వ్యవస్థకు ఆలోచన చేసినా.. అన్నీ ఈ 46 ఏళ్ల అమెరికన్‌కే చెల్లాయి. అలాంటి మస్క్‌ ఇంకో ఏడేళ్లలో రవాణాకు విమానాలకు బదులుగా రాకెట్లను వాడతానంటే ఆసక్తి పెరగడం సహజం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యలో మస్క్‌ తన భవిష్యత్తు ఆలోచనలను పంచుకున్నారు. గతంలో పేర్కొన్నట్లే 2024 కల్లా అంగారకుడిపైకి మనుషులను పంపి తీరతానని.. ఇందుకు బీఎఫ్‌ఆర్‌ అనే ఓ భారీ రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో బీఎఫ్‌ఆర్‌ రాకెట్‌లో ఉండే 40 కేబిన్ల ద్వారా వంద మంది ప్రయాణించవచ్చనని మస్క్‌ తెలిపారు.  

ఫాల్కన్‌–9 మాదిరిగానే.. 
మస్క్‌.. నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాములను తన స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. మళ్లీమళ్లీ వాడుకోగలగడం ఫాల్కన్‌–9 ప్రత్యేకత. ఫాల్కన్‌–9తోపాటు డ్రాగన్, ఫాల్కన్‌ హెవీ పేరుతో వేర్వేరు సామర్థ్యాలు గల రాకెట్లను మస్క్‌ తయారు చేస్తున్నారు. వీటి స్థానంలో ఓ బీఎఫ్‌ఆర్‌ రాకెట్‌ను వాడటం ద్వారా అంగారక ప్రయాణాన్ని చౌకగా పూర్తి చేయగలనని మస్క్‌ భావిస్తున్నారు. ఫాల్కన్‌–9 రెండు దశల రాకెట్‌. మొదటిది విడిపోయాక సరుకులున్న భాగం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుని మళ్లీ భూమ్మీద ల్యాండ్‌ కాగలదు. విడిపోయిన మొదటి దశ భాగాన్ని వృథా చేయకుండా తర్వాతి ప్రయోగానికి వాడుకుంటారు.

బీఎఫ్‌ఆర్‌లో ఇలాంటివి ఉండవు. ఇంధనం మండే ప్రాంతం.. ప్రయా ణికులు లేదా సరుకులు ఉండే చోటు అన్నీ ఒకే రాకెట్‌లో ఉంటాయన్నమాట. ఇంధన ఖర్చులు తక్కువగా ఉండి.. రాకెట్‌ను మళ్లీ వాడుకునే అవకాశం ఏర్పడితే.. ఉపగ్రహాల ప్రయోగం, అంగారకుడి యాత్ర ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని మస్క్‌ అంటున్నారు. అన్నీ సవ్యంగా సాగితే తొలి బీఎఫ్‌ఆర్‌ నిర్మాణం వచ్చే ఏడాది మొదలవుతుందని, ఐదేళ్లలో అందుబాటులోకి వస్తుందని మస్క్‌ చెప్పారు. 2024 నాటికల్లా నాలుగు బీఎఫ్‌ఆర్‌ రాకెట్లను అంగారకుడిపైకి ప్రయోగిస్తామని, వీటిల్లో 2 ప్రయాణికులతో కూడినవి ఉంటాయన్నారు. తొలి వ్యోమగాములు అంగారక ఉపరితలంపై కాలనీని ఏర్పాటు చేసి, తిరుగు ప్రయాణానికి ఇంధనాన్ని తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారన్నారు.

భూమిపైనా వాడుకోవచ్చు 
బీఎఫ్‌ఆర్‌ రాకెట్లు భూమి మీద కూడా రవాణాకు వాడుకోవచ్చని మస్క్‌ పేర్కొన్నారు. భూమి మీద ఏ మూల నుంచైనా ఇంకో చోటికి వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. గంట సమయంలోనే ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చని చెప్పారు. నీటిపై ఏర్పాటు చేసే ప్లాట్‌ఫాంపైనా ల్యాండయ్యే సామ ర్థ్యం వీటికి ఉంటుందన్నారు. ఒక్కో రాకెట్‌ ప్రయాణానికి టికెట్‌ ఖర్చు ఎంతన్నది మస్క్‌ చెప్పలేదుగానీ.. అంగారక యాత్రకు దాదాపు రూ.కోటీ నలభై లక్షలు ఖర్చవుతుందన్నారు. భూమి మీద ప్రయాణానికి మరీ ఇంత ఖర్చు కాకపోవచ్చు.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌   

మరిన్ని వార్తలు