ఆనందం ఆయుష్షునివ్వదు!

14 Dec, 2015 19:11 IST|Sakshi
ఆనందం ఆయుష్షునివ్వదు!

నవ్వడం భోగం నవ్వలేకపోవడం రోగం.. ఇంకా చెప్పాలంటే సంతోషం సగం బలం. ఇలా ఆనందంగా, హాయిగా ఉంటే అనారోగ్యం దరిచేరదని చాలామంది భావిస్తారు. ఆనందం ఆరోగ్యంపై అద్భుత ప్రభావం చూపుతుందని, మానసికోల్లాసాన్ని కలిగించి, మనసుకు ప్రశాంతతనిస్తుందని నమ్మేవారంతా ఏకంగా నవ్వుల దినోత్సవాలను జరపడమేకాక, లాఫింగ్ క్లబ్బుల వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవన్నీ వట్టి నమ్మకాలేనంటున్నారు లండన్ అధ్యయనకారులు. అనారోగ్యం, ప్రాణభయం వంటివి అసంతృప్తిని కలిగించి ఆయుక్షీణం కలిగిస్తాయేమో కానీ, ఆనందం వల్ల ఆరోగ్యం చేకూరే అవకాశం లేదంటున్నారు. 

లండన్‌లో నిర్వహించిన  మిలియన్ ఉమెన్ స్టడీలో మహిళలను పరిశోధకుల బృదం.. ఒత్తిడి, సంతోషం, అసంతృప్తి, నియంత్రణ, విశ్రాంతి వంటి వాటి ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో తెలుపాలని ఓ ప్రశ్నావళిని అందించారు. సమాధానం ఇచ్చినవారిలో ఆరుగురిలో ఐదుగురు సాధారణంగా సంతోషానికే తమ ఓటేశారు.  దీన్నిబట్టి చూస్తే అసంతృప్తితో ఉన్నవారిలో ధూమపానం, బద్ధకం, భాగస్వామితో సరిగా  లేకపోవడం వంటి అలవాట్లు ఉండాలని,  వారంతా సంతోషంగా, ఆరోగ్యంగానే ఉన్నారని అధ్యయనకారులు చెప్తున్నారు. మరోవైపు అప్పటికే అనారోగ్యంతో ఉన్న మహిళలు మాత్రం విచారంగానూ, ఒత్తిడితోనూ, నియంత్రణాశక్తిని కోల్పోయి, విశ్రాంతి లేకుండా ఉన్నట్లు ఇలా పలు భావాలను ప్రకటించినట్లు అధ్యయనంలో తేలింది.

పది సంవత్సరాల కాలంలో మొత్తం ఏడు లక్షలమంది మహిళలను పరిశీలించగా సగటున 59 సంవత్సరాల వయసు పైబడినవారు  సుమారుగా 30 వేలమంది మరణించినట్లుగా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.  అలాగే వారి జీవన శైలి, అలవాట్ల ఆధారంగా చూసినపుడు మరణాల సంఖ్య సంతోషంగా ఉన్నవారికి, విచారంగా ఉన్నవారికీ మధ్య పెద్దగా తేడా లేనట్లు తేలింది. అందుకే ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ బెట్టె లియు.. అనారోగ్యం వల్ల అసంతృప్తి చోటుచేసుకుంటుందే తప్ప... అసంతృప్తి వల్ల అనారోగ్యం దరిచేరదంటున్నారు. అసంతృప్తి, ఒత్తిడి వంటివి మృత్యువుపై ప్రత్యక్ష ప్రభావం చూపినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన అంటున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా