హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...

11 Feb, 2016 06:29 IST|Sakshi
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...

ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే'  పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా  పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది.

హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో  వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో  కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది.  దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని  సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది.

అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్  వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి  కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన  గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు