ఒబామా పెట్ డాగ్స్ కూడా బిజీ!

30 May, 2016 20:51 IST|Sakshi
ఒబామా పెట్ డాగ్స్ కూడా బిజీ!

వాషింగ్టన్: పెట్ డాగ్స్ పట్ల యజమానులు ప్రేమానురాగాలు కురిపించడం చూస్తుంటాం. అబ్బో అవి ఎంత రాజభోగం అనుభవిస్తున్నాయో అంటూ వాటి అదృష్టాన్ని కొనియాడుతాం. అటువంటిది ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఇంట్లో పెట్ డాగ్స్ గా స్థానం పొందిన ఆ శునకాల అదృష్టాన్నేమనాలి? అటువంటి స్థానంలో ఉండటమేకాక, అక్కడ రాజ భోగాలు అనుభవించడంతోపాటు ఆ కుటుంబ సభ్యుల అమితమైన ప్రేమను అందుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ బో అండ్ సన్నీలు. మరి త్వరలో ఒబామా పదవీకాలం ముగిసిన తర్వాత వాటి స్థానం ఎక్కడ?

సాధారణంగా శునకాలు చేసే పని ఏముంటుంది? తినడం పడుకోవడం. ఇంకా చెప్పాలంటే యజమాని ఇంటికి కాపలా కాయడం. కొన్ని జాతి శునకాలు దొంగలను గుర్తించడంలో ఆరితేరి పోలీసులకు సహకరిస్తుంటాయి. అయితే ఒబామా వైట్ హౌస్ లో నివసిస్తున్న బో మరియు సన్నీలు మాత్రం  ప్రెసిడెంట్ ఒబామాతోపాటు ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ కలిగి ఉంటాయని తెలుసా? వైట్ హౌస్ అంబాసిడర్లుగా వ్యవహరించే ఆ శునకాల షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.  ఒబామా కుటుంబం వైట్ హౌస్ లో పెంచుకుంటున్న పోర్చుగీస్ వాటర్ డాగ్స్ జాతికి చెందిన రెండు శునకాల్లో పెద్దది బో. ఏడేళ్ళ వయసున్న బో కు ఫస్ట్ డాగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ టైటిల్ కూడ ఉంది. ఇక రెండవది సన్నీ. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు శునకాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారని, వాటితో ఫొటోలు తీయించుకోవాలని ఆశ పడతారని సాక్షాత్తూ మిచెల్లే ఒబామాయే చెప్పడం విశేషం. అందుకే వాటి షెడ్యూల్ ను సైతం నెల ప్రారంభంలోనే ఖరారు చేస్తారట. దాని ప్రకారమే వాటిని ప్రదర్శనకు ఆమోదిస్తామని కూడ ఆమె అంటారు. ఈస్టర్ సమయంలో సందర్శనకు వచ్చిన వారికి వినోదాన్ని అందించడంలో బో, సన్నీలు ఎంతో బిజీగా ఉంటాయి. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ సందర్భంలో కూడ పర్యాటకులను స్వాగతించే మెచెల్లేకు పక్కనే బో ఉంటుంది. అలాగే ప్రతియేటా  క్రిస్మస్ ముందు ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్ళే సమయంలో కూడ మిచెల్లే తో పాటు ఆ రెండు శునకాలు ఉండాల్సిందే. అసలు బో, సన్నీలు ఎంత గుర్తింపు పొందాయో చెప్పడానికి గతంలో వాటిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నమే పెద్ద నిదర్శనం.


ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న బో.. ఒబామా కుటుంబంలోకి 2009 లో అడుగు పెట్టింది. 2008  అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామాకు మంచి మద్దతుదారుడగా ఉండటమే కాక, ఆయన కుటుంబానికి సైతం సన్నిహితుడుగా ఉండే  మాజీ సెనేటర్ ఎడ్వార్డ్ ఎం కెన్నడీ... 'బో' ను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ళ వయసున్న సన్నీ 2013 ఆగస్టు లో ఒబామా కుటుంబ సభ్యురాలైంది. బో అప్పటికే వైట్ హౌస్ గ్రౌండ్స్ కీపర్ హెడ్ గా ఉన్న డేల్ హానీ కి హెల్పర్ గా విధులు నిర్వహిస్తోంది.

ప్రతిరోజూ ఉదయం డేల్ తో పాటు నేషనల్ పార్క్ సేవల్లో ములిగిపోయే బో... నేషనల్ పార్క్ క్రూ సిబ్బందితో పాటు వాకింగ్ చేయడం, అక్కడి మొక్కలను పరీక్షించడం వంటివి తన బాధ్యతగా ఉన్నట్లే కనిపిస్తుందని, అలాంటి సమయంలో అసలు తమనుసైతం పట్టించుకోకుండా  సీరియస్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఉంటుందని మిచెల్లే చెప్తుంటారు. అయితే తమ ఇంట్లో తమతోపాటు ఉంటున్న పెంపుడు జంతువులైన బో, సన్నీలు తమ కుటుంబ సభ్యులుగానే పెరుగుతున్నాయని, ఒక్కోసారి అవి నా ఒళ్ళోనూ, నా కుర్చీమీద కూర్చుంటాయని, నేను కూడ వాటిని ఎంతో ప్రేమగా నిమిరుతూ ఉంటానని, అవి మాకు ఎంతో ప్రేమను అందించడంతోపాటు, ఎంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయని మిచెల్ చెప్తారు.

ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారి పెంపుడు జంతువులు  ప్రజాదరణ పొందడం, వారికి సహచరులుగా ఉండటం సాధారణమే. అయితే వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా పదవీ కాలం ముగియనున్న బరాక్ ఒబామా...  గతేడాది ఓ సందర్భంలో  తన పెంపుడు జంతువులైన బో, సన్నీల గురించి కూడ ప్రస్తావించారు. తాను వైట్ హౌస్ ఖాళీ చేసే ముందు తన పెంపుడు జంతువులు చించేసిన కాగితాలతో సహా ప్రతి చిన్న విషయాన్నీ క్లియర్ చేసి వెడతానంటూ హామీ ఇవ్వడం ఆయనకు వాటిపై ఉన్న ప్రేమతోపాటు... పదవిపట్ల ఆయనకున్న బాధ్యతను కూడ వెల్లడించింది.

మరిన్ని వార్తలు