క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్‌

14 Jan, 2020 16:14 IST|Sakshi

టెహ్రాన్‌: ఉక్రెయిన్‌ విమానాన్ని కూల్చివేసి క్షమించరాని తప్పు చేశామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక్కరి వల్ల జరిగిన తప్పిదం కాదని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ దుర్ఘటనకు ఇరాన్‌ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్‌- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ విమానాన్ని ఇరాన్‌ సైన్యం కూల్చి వేసిన విషయం విదితమే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్‌ పౌరులు, 10 మంది స్వీడిష్‌ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్‌ పౌరులు, 63 మంది కెనడియన్లు) దుర్మరణం పాలయ్యారు. కాగా తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్‌.. కెనడా, బ్రిటన్‌ తదితర పాశ్చాత్య దేశాధినేతల నుంచి విమర్శలు ఎదుర్కొంది.(అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు!)

ఈ క్రమంలో ఉక్రెయిన్‌ విమానాన్ని క్షిపణి కూలుస్తున్న వీడియో వైరల్‌ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో విమానాన్ని కూల్చింది తామేనని ఇరాన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించింది.  ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మంగళవారం మాట్లాడుతూ..‘ ఈ విషాదకర ఘటనకు కారణమైన వారిని విచారిస్తున్నాం. నిజానికి ఇది క్షమించరాని తప్పు. మాటలకు అందని విషాదం. అయితే దీనికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయాలనుకోవడం లేదు. విమానాన్ని తామే కూల్చేశామని ఇరాన్‌ సైన్యం తమ తప్పిదాన్ని అంగీకరించడం మంచి విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేయగలరనే నమ్మకం ఉంది. విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఇరాన్‌ పౌరులు, వివిధ దేశాల పౌరుల కుటుంబాలకు మేం జవాబుదారీగా ఉంటాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు మా వైపు చూస్తోంది’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా ఘటనకు బాధ్యులైన వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో జడ్జితో పాటు పలువురు న్యాయ నిపుణులు కూడా ఉంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.... హసన్‌ ప్రసంగం ముగిసిన వెంటనే... 176 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదంలో పలువురిని అరెస్టు చేసినట్లు ఇరాన్‌ న్యాయ శాఖ అధికారి వెల్లడించారు.

ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం

మరిన్ని వార్తలు