అమెరికాలో విద్వేష దాడులు తగ్గుతాయట!

12 Nov, 2018 19:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న విద్వేష దాడుల వల్ల స్థానికులే కాకుండా ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు భయాందోళనలకు గురవుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో గత నాలుగేళ్లుగా వరుసగా పెరుగుతున్న విద్వేష పూరిత దాడులు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న 2017లో ఒక్కసారిగా 57 శాతం పెరిగాయని ‘యాంటీ డిఫమేషన్‌ లీగ్‌’ వెల్లడించింది. అలాగే అక్టోబర్‌ 27వ తేదీన పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన విద్వేషపూరిత దాడిలో 11 మంది మరణించిన విషయం తెల్సిందే.

నవంబర్‌ 6వ తేదీన జరిగిన ప్రజా ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రట్లు మెజారిటీ సాధించిన నేపథ్యంలో దేశంలో విద్వేష పూరిత దాడులు తగ్గుముఖం పట్టవచ్చని యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ సీఈవో జొనాథన్‌ గ్లీన్‌భట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక విద్వేష దాడులు పెరగడానికి ఆయన విద్వేష పూరిత ప్రసంగాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. విద్వేషపూరిత దాడుల నుంచి తప్పించుకున్నవారికి ఆయన ఇటీవల ‘కరేజ్‌ అగనెస్ట్‌ అవార్డ్స్‌’ను అందజేశారు. విద్వేష దాడులు అనేవి అంటురోగం లాంటిదని, మనం సకాలంలో జోక్యం చేసుకొని అరికట్టలేకపోతే అంతటా వ్యాపిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్ల ప్రాబల్యం వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు రిపబ్లికన్ల అధికారం తగ్గుతుందని, అది సామాజిక పరిస్థితులు మెరగుపడేందుకు దారితీస్తుందని, తద్వారా దేశంలో విద్వేష పూరిత దాడులు తగ్గుతాయని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అవంతట అవే తగ్గుతాయనుకోవడం పొరపాటే అవుతుందని, ఈ దిశగా డెమోక్రట్లు ప్రజా ప్రతినిధుల సభ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు