ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు

28 Oct, 2019 10:31 IST|Sakshi

దట్టమైన అడవి మధ్యలో నల్ల కాళ్ల జెర్రి లాంటి తారు రోడ్డుమీద వెళుతుంటే హఠాత్తుగా భారీ వర్షం రావడం, మార్గమధ్యంలో కారు చెడిపోవడం, అందులో ప్రయాణిస్తున్న నలుగురైదుగురు మిత్రులు ఆ రాత్రికి ఆశ్రయం వెతుకుతూ ఓ పాడు పడిన బంగళా వద్దకు వెళ్లడం, ఆ రాత్రికి భయం భయంగా అక్కడే పడుకోవడానికి ప్రయత్నించడం, అర్ధరాత్రి దాటాక భూత, ప్రేత, పిశాచాల అరుపులు, కేకలు వినిపించడం.... పాత్రలతోపాటు ప్రేక్షకులుగా మనమూ జడసుకోవడం చాలా ‘కైమ్‌ త్రిల్లర్‌’ చిత్రాలను చూడడం ద్వారా అనుభవించే ఉంటాం. 

అలాంటి భయానక అనుభవాలను సినిమాల్లోని పాత్రలకే కాకుండా మనకు కూడా అంతటి అనుభవాలను కలిగించేందుకు అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ‘మ్యాక్‌ కామే మానర్‌’ పేరిట ఓ ‘హారర్‌ హౌజ్‌’ను ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లి పది గంటలు గడిపి వచ్చిన వాళ్లకు 20 వేల డాలర్లు ( 14,20,000 రూపాయలు) బహుమతిగా అందజేస్తామని ‘మాక్‌ కామే మానర్‌’ యజమాని రస్‌ మాక్‌ కామే సవాల్‌ చేస్తున్నారు. ఇందులోకి వెళ్లి రావాలనుకుంటున్న సాహసికులకు చాలా షరతులు కూడా ఉన్నాయి. 

వారు సంపూర్ణ ఆరోగ్యంతోనే కాదు, 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. శారీరకంగా, మానసికంగా బలిష్టంగా ఉన్నట్లు కుటుంబ వైద్యుడి నుంచి సర్టిఫికెట్‌ తీసుకరావాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వచ్చాక కూడా హారర్‌ హౌజ్‌ నిర్వాహకులు సొంత వైద్యుల చేత ‘ఫిట్‌నెస్‌’ పరీక్షలు చేయిస్తారు. అందులో పాస్‌ కావాలి. ఓ డ్రగ్‌ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దాన్ని కూడా తట్టుకోవాలి. లోపలికి వెళితే ఎలాంటి దశ్యాలు ఉంటాయో వెళ్లాలనుకుంటున్న సాహసికులకు ముందుగానే వీడియోల ద్వారా చూపిస్తారు. లోపలికి వెళితే ఏం జరుగుతుందో కూడా వివరిస్తారు. 

ఇంతకు ముందు అందులోకి వెళ్లిన వారి అనుభవాలను కూడా చూపిస్తారు. ఆ తర్వాతనే ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తారు. కొన్నేళ్లుగా ఈ హారర్‌ హౌజ్‌ను నిర్వహిస్తున్నా ఇంతవరకు ఎవరు కూడా పది గంటల పాటు ఆ ఇంట్లో గడిపి వచ్చిన వారు, 20 వేల డాలర్లు అందుకున్న వారు లేరని రస్‌ మాక్‌ కామే తెలిపారు. ఇందులో వెళ్లి వచ్చిన వారికి ఎక్కడా చిన్న గాయం కూడా కాదని గ్యారంటీ కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యలోనే భయపడి బయటకు రావాలని కోరుకుంటున్న వారు నోటితో చెప్పినా, సైగలు చేసినా సురక్షితంగా భయటకు తీసుకొస్తామని ఆయన తెలిపారు. 

ఈ భయానక హౌజ్‌ను నిర్వహించడం వెనక తమకు మంచి లక్ష్యమే ఉందని, ఈ అనుభవం కలిగిన వారు భవిష్యత్తులో సమాజంలోనే కాకుండా ప్రకృతిపరంగా ఎదురయ్యే ఎలాంటి భయానక అనుభవాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని రస్‌ మాక్‌ తెలిపారు. హౌజ్‌లోకి వెళ్లిన వారిని కొన్ని నీళ్లు మాత్రమే ఉన్న చిన్న బాత్‌ టబ్‌లో కూర్చోబెట్టి ఆ నీటిలో ఓ పెద్ద షార్క్‌ ఉందని చెబుతామని, నిజంగానే అది ఉన్నట్లు భ్రమించి భయపడతారని ఆయన తెలిపారు.

కానీ ఆ ఇళ్లంతా రక్తసిక్తమైన గోడలతో, పుర్రెలతో ఉంటుంది. దెయ్యాల మాస్క్‌లు ధరించి వచ్చే మనుషులు గొంతులు పట్టుకొని తలలు కోస్తున్నట్లు, చేతులు నరికేస్తున్నట్లు, రక్తం నిండిన బాత్‌ టబ్బుల్లో ముంచేస్తున్నట్లు నటిస్తారు. అలా మనుషులే నటిస్తారా? అవన్నీ వీడియో దశ్యాలా ? తెలియవు. అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఈ ‘హారర్‌ హౌజ్‌’ నడుస్తున్నప్పటికీ అంతగా ప్రజలకు దృష్టికి రాలేదు. ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్‌’, హంటర్స్‌–ఆర్ట్‌ ఆఫ్‌ ది స్కేర్‌’ పేరిట ఈ హౌజ్‌ గురించి చూపించడంతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

>
మరిన్ని వార్తలు