పిల్లులు.. కుక్కలను తింటున్నారు!

15 Feb, 2016 20:18 IST|Sakshi
పిల్లులు.. కుక్కలను తింటున్నారు!

ఐసిస్ అధీనంలోని నగరాల్లో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించినవారు కూడా ఎముకల గూడుల్లా తయారయ్యారు. కడుపు నిండని తల్లులు.. తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని దీనావస్థకు చేరుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనలేక, కడుపు మాడ్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. అన్నం స్థానంలో గడ్డి, మూలికలు, వేళ్ల వంటి వాటితో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి పిల్లులను, కుక్కలను చంపి తినేందుకూ వెనుకాడటం లేదు.  

సిరియా ముట్టడి ప్రాంతంలో శిశువులు వేలాది మంది పస్తులతో మరణిస్తున్నారు. నెలల వయసులోనే పోషకాహారం అందక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన డైర్ అజోర్ ప్రాంతం ఇప్పుడు మహిళలు, పిల్లల మరణాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మధ్య ప్రాంతం నుంచి తప్పించుకొని డీర్ ఎజోర్ లో చిక్కుకున్న వేలాదిమంది శరణార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. బషర్ అల్ అస్సాద్ అందించే చాలీచాలని సరుకుల పంపిణీ.. శరణార్థులను చిక్కిశల్యమయ్యేలా చేస్తోంది. ఆహారధాన్యాలు అందించాలంటే సైన్యాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కార్గో విమానాలు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పిల్లలు.. తిండిలేక ఆకలితో మరణిస్తున్నారు. ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుగా మారిపోతున్నారు. వేలాదిమంది చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అతిసారం వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని శిశువుల చిత్రాలను చూస్తే అక్కడి వాస్తవిక పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.

11 నెలల నుంచి ఐసిస్ ముట్టడిలో ఉన్న డైర్ అజోర్‌లో చిక్కుకున్న సుమారు లక్ష మందికి పైగా శరణార్థులు ఆకలి, అనారోగ్యాలతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బషర్ అల్ అస్సద్ అధీనంలోకి డైర్ అజోర్ జిల్లాలు చేరిన 8 నెలలకు ఆ బిడ్డలు పుట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి దీనావస్థలో ఉన్న సమయంలో శుక్ర్ అల్ అఫ్రే. పుట్టాడు. అతని తల్లి మన్నార్ కస్సర్ అల్ డఘిమ్ ఆహారం లేక కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో పోషకాహారం లేని ఆ చిన్నారి తీవ్ర రక్తహీనతకు లోనయ్యాడు. బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు దుఖసాగరంలో జీవిస్తున్నారు. చావైనా తమను కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తిండిలేక, బతికేందుకు ఆసరా లేక శరణార్థులు చావే శరణ్యంగా జీవిస్తున్నారు. ముట్టడి ప్రాంతంలో సాధారణ జీవన పరిస్థితులు చిన్నాభిన్నమైపోయాయని, శరణార్థులు తిండిలేక.. ఆకలి తట్టుకోలేక ఏం కనిపించినా తినే స్థితికి చేరారని చెప్తున్నారు. స్థానిక జనజీవనం స్తంభించిపోయి, ఆస్పత్రుల్లో రోగులు, బయట సైనికులను మాత్రమే చూడగలిగే పరిస్థితి దాపురించిందని స్థానిక దుకాణదారుడు అబుల్ ఖాసిం చెప్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా తిండి కోసం జనం ఎదురు చూస్తున్నారని, పిల్లలను బతికించుకునేందుకు వేడినీటిలో ఉప్పు కలిపి, బ్రెడ్ తో పెడుతున్నారని అంటున్నాడు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా, భయంకరంగా మారుతోందని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు పిల్లల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొందరు ఆహారం కోసం ఇంట్లోని వస్తువులు, ఇళ్ళూ అమ్మేసిన దాఖలాలున్నాయి. కొందరు గడ్డి, మూలికలు, ఆకులు తింటుంటే.. మరి కొందరు కుక్కలు, పిల్లులను చంపి తినడం శోచనీయంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు వంద రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ ముగ్గురికి మాత్రమే తిండి దొరుకుతోంది. ఒకటి సైన్యం, మరొకరు విదేశాల్లో బంధువులు ఉన్నవారు, ఇంకొకరు సంపన్నులు. మిగిలినవారంతా కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. ఆహారం అందే మార్గం లేక, ధరాఘాతాన్ని తట్టుకోలేక పొట్ట చేత పట్టుకొని, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని నిర్జీవంగా బతుకుతున్నారు.

 

మరిన్ని వార్తలు