క్షిపణి హెచ్చరికలతో హవాయిలో కలకలం!

15 Jan, 2018 03:59 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉత్తరకొరియా నుంచి ఖండాంతర క్షిపణి దూసుకొస్తోందనీ, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మొబైల్స్‌కు సందేశాలు రావడంతో అమెరికాలోని హవాయి రాష్ట్ర ప్రజలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. ఇదంతా ఓ ఉద్యోగి తప్పిదమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘ఓ ఖండాంతర క్షిపణి హవాయి వైపు దూసుకొస్తోంది.

వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి’ అని మొబైల్స్‌కే కాకుండా టీవీ, రేడియో కేంద్రాలకూ శనివారం సందేశాలు అందాయి. దీంతో పలువురు రెస్టారెంట్లు, హోటళ్ల బేస్‌మెంట్లలో దాక్కుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. 10 నిమిషాల అనంతరం ఇది పొరపాటున వచ్చిన హెచ్చరికని అధికారులు వివరణ ఇచ్చారు. ఓ ఉద్యోగి పొరపాటున హెచ్చరిక బటన్‌ను నొక్కాడని హవాయి గవర్నర్‌ డేవిడ్‌ ఇగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు