ఆరేళ్ల పాటు ఉద్యోగానికి డుమ్మా!

15 Feb, 2016 14:14 IST|Sakshi
ఆరేళ్ల పాటు ఉద్యోగానికి డుమ్మా!

ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ఉద్యోగానికి వెళ్లకుండా డుమ్మా కొట్టాడు. అయినా ఎవరూ ఆ విషయాన్ని గుర్తించనే లేదు! 69 ఏళ్ల స్పానిష్ ఉద్యోగి నిర్వాకాన్ని ఇన్నాళ్ల తర్వాత కనిపెట్టడంతో.. ఇప్పుడు ఆయనకు దాదాపు రూ. 20 లక్షల మేరకు జరిమానా విధించారు. ఆయన పేరు జోక్విన్ గార్షియా. తన బాస్‌ల మధ్య ఉన్న గొడవను అలుసుగా తీసుకుని ఆరేళ్ల పాటు డుమ్మా కొట్టాడు. తీరా.. సుదీర్ఘ కాలంపాటు ఉద్యోగం చేసినందుకు ఆయనకు ఒక మెడల్ ఇద్దామని అనుకున్నప్పుడు అయ్యగారి బాగోతం తెలిసింది.

2007 నుంచి 2010 వరకు అతడు అస్సలు పని చేయనే లేదని, మొత్తం 6 సంవత్సరాల పాటు విధులకు హాజరు కాకుండా ఎగ్గొట్టాడని తేల్చిన కోర్టు.. గార్షియాకు రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఇది అతడి ఏడాది జీతానికి సమానం. నిన్న ఏం చేశావు.. పోయిన నెలలో ఏం చేశావని అతడిని ఎంత అడిగినా ఎలాంటి సమాధానం రాలేదని.. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆరేళ్ల పాటు రాలేదన్న విషయం తెలిసిందని ఆ కంపెనీ మాజీ మేనేజర్ చెప్పారు.

తాను ఆఫీసుకు వెళ్లానని, కానీ అక్కడ చేయడానికి పనేమీ లేకపోవడంతో వెళ్లలేదు తప్ప వేరే కారణం ఏమీ లేదని గార్షియా కోర్టుకు తెలిపాడు. అతడు అప్పటికే రిటైర్ అయ్యాడు కాబట్టి.. ఇక అతడిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రసక్తి రాలేదు.

మరిన్ని వార్తలు