10 ఏళ్ల వేధింపులకు.. 19 ఏళ్ల శిక్ష..

29 Apr, 2016 20:01 IST|Sakshi

వాషింగ్టన్: ఢిల్లీ నుంచి అమెరికాలోని టెక్సాస్ వరకు సుమారు 10 ఏళ్లపాటు ఓ యువతి వెంటపడుతూ, వేధించిన వ్యక్తికి అమెరికా కోర్టు 19 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తనతో పాటు చదువుకున్న సహచర విద్యార్థిని వేధిస్తున్న జితేందర్ సింగ్ కు ఈ శిక్షను విధిస్తున్నట్లు కొల్లిన్ కంట్రీ జిల్లా అటార్నీ గ్రేగ్ విల్లీస్ తీర్పులో పేర్కొన్నారు.

కోర్టు ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన జితేందర్ చదువుకునే సమయంలో ఓ యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో 2006లో ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ  కోరాడు. ఆ యువతి తిరస్కరించడంతో  జితేందర్ తన చదువు పూర్తి అయ్యేవరకు వేధిస్తూనే ఉన్నాడు. 2007లో ఆమె ఎంఎస్ చేసేందుకు న్యూయార్క్ యూనివర్సిటీలో చేరినా.. అక్కడ కూడా జితేందర్ ఆ యువతిని వదల్లేదు. అంతేకాకుండా ఇండియాలో ఆమె తండ్రిని హింసించాడు. దీంతో యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. జైలు ఊచలు లెక్కపెట్టిన అతడు మరోసారి యువతి జోలికి వెళ్లనని చెప్పటంతో వదిలిపెట్టారు.

ఆ తర్వాత అమెరికాలో ఆ యువతి అమ్మాయి చదువుతున్న యూనివర్సిటీలోనే సీటు కోసం ప్రయత్నించి విఫలం చెందిన జితేందర్ ఇంటర్న్ షిప్ కోసం ఆమె కాలిఫోర్నియా వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికీ చేరుకున్నారు. ఆతర్వాత నుంచి యువతిని జితేందర్ ఫోన్లో వేధిస్తుండేవాడు. ఆమె ఇంట్లో లేని సమయంలో అక్కడకు వెళ్లి యువతి పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్లు, నగలను తీసుకోవడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జితేందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతగాడికి 19ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కాగా బాధిత యువతి వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది.

మరిన్ని వార్తలు