లాటరీ తగిలింది... టికెట్ పోయింది

15 Apr, 2014 00:37 IST|Sakshi

న్యూయార్క్: అమెరికాలోని ఓ దురదృష్టవంతుడు చేతులదాకా వచ్చిన డబ్బును చెత్తకుప్పలో పడేశాడు. ఏడాది కిందట సౌత్‌క్యూన్ స్ట్రీట్‌లోని జ్యూ గ్రోసెరీలో ఓ వ్యక్తి 25 లాటరీ టికెట్‌లు కొన్నాడు. అతను కొన్న టికెట్‌కు లాటరీ తగిలినా ఇప్పటివరకు డబ్బులు మాత్రం తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లాటరీ టికెట్ కాలపరిమితి ముగిసింది.

దీనిపై ఆ దురదృష్టవంతుడికి టికెట్ అమ్మిన వెన్డీ హింటన్ మాట్లాడుతూ.... ‘ఓ వ్యక్తి తరచుగా ఒకే సిరీస్ నంబర్ ఉన్న లాటరీ టికెట్‌లను మా దగ్గర కొనేవాడు. గత ఏడాది మార్చిలో కూడా అదే విధంగా 25 టికెట్‌లను కొనుక్కున్నాడు. రోజూ వచ్చి తన నంబర్‌కు లాటరీ తగిలిందో లేదో కూడా చూసుకునే వాడు. కానీ, ఆ రోజు లాటరీ తగిలిన తన నంబర్‌ను తప్పుగా చూసుకొని చేతిలో ఉన్న టికెట్‌లను చెత్తబుట్టలో పడేశాడు. రూ. 7.52 లక్షలు తగిలిన ఆ టికెట్ కాలపరిమితి ఇప్పుడు ముగిసింది. దీంతో లాటరీ డబ్బులు మొత్తం కంపెనీకి వెళ్లిపోతాయి’ అని చెప్పింది. టికెట్ తగిలిన లాటరీని చెత్తకుప్పలో పడేసిన ఆ వ్యక్తి పిచ్చివాడిలా ప్రవర్తించాడని పేర్కొంది.

మరిన్ని వార్తలు