దుబాయ్ లో ఇక ఇన్సూరెన్స్ తప్పనిసరి

14 Dec, 2016 19:08 IST|Sakshi
దుబాయ్ లో ఇక ఇన్సూరెన్స్ తప్పనిసరి

దుబాయ్: దుబాయ్ లో నివసించే వారెవరైనా ఇకనుంచి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. వచ్చే జనవరి 1 నుంచి దుబాయ్ లో నివసించే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  లేదంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఇన్సూరెన్స్ లేని పక్షంలో నెలకు 500 వందల దిర్హమ్స్ (ఇప్పుడున్న రేటు ప్రకారం దాదాపు 9 వేల రూపాయలు) జరిమానా వేస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక వీసా రెన్యువల్ చేయరు. ఉన్న వీసాకు పొడగింపు కూడా అనుమతివ్వరని నిబంధనలు పెట్టారు.

దుబాయ్ లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇకనుంచి వారిని స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించాలి. లేదా, పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం సిబ్బందికి ఇన్సూరెన్స్ చెల్లించాలి. అలా చేయని పక్షంలో సొంతగానైనా హెల్త్ ఇన్సూరెన్స్ విధిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కనుక ఒక్క ఉద్యోగికి మాత్రమే ఇన్సూరెన్స్ కల్పిస్తే ఆ ఉద్యోగి తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా అందులో చేర్పించుకోవాలి.

ఆ మేరకు వచ్చే జనవరి 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్ ఏ), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్ అఫేర్స్ (జీడీఆర్ ఎఫ్ ఎ) ప్రకటించింది. అయితే ఈ తప్పని సరి ఇన్సూరెన్స్ ఒక్క దుబాయ్ లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దుబాయ్ లోని అన్ని కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్ల జాబితాలను సమర్పించాలని డీహెచ్ ఏ ఆదేశాలు జారీ చేసింది.

ఇన్సూరెన్స్ కోసం రకరకాల ప్లాన్స్ ఇవ్వగా, అందులో బేసిక్ ప్లాన్ ప్రకారం ఏడాదికి 565 నుంచి 650 దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 4 వేలకు తక్కువగా వేతనం పొందే వారి కోసం ఈ బేసిక్ ప్లాన్ రూపొందించినట్టు అధికారులు వివరించారు. బేసిక్ ప్లాన్ పై 1,50,000 దిర్హమ్స్ కవరేజీ ఉంటుందని డీహెచ్ ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ హైదర్ అల్ యూసుఫ్ తెలిపారు.


భారత దేశం నుంచి వెళ్ల అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, వివిధ కంపెనీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఇన్సూరెన్స్ సొమ్ము భరించని పక్షంలో అలాంటి వారందరికీ ఎంతో భారంగా మారుతుందని చిన్నా చితకా పనులు చేసుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా భారత్‌ నుంచి యూఈఏకు వలస వెళ్లిన వాళ్లు మొత్తం 40లక్షల మంది ఉండగా వారిలో కేరళ నుంచి పది లక్షల మంది, తమిళనాడు నుంచి నాలుగున్నర లక్షలమంది, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారున్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ నిబంధన దుబాయ్‌లో మాత్రమే అమలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు