ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఇలా చేయండి!

1 Mar, 2020 15:11 IST|Sakshi

లంఖణం పరమౌషధం! ఎట్లనిన..

చాలా పాతకాలపు నానుడి.. లంఖణం పరమౌషధం! ఆ తరువాతి కాలంలో తిండి కలిగితేనే కండ కలదోయ్‌ అన్నారు గానీ.. ఇటీవల కాలంలో మాత్రం మరోసారి సీన్‌ రివర్స్‌ అయింది. వయసు మీదపడ్డా ఆరోగ్య సమస్యలేవీ దరి చేరకూడదనుకున్నా.. ఎక్కువకాలం బతకాలని ఆశిస్తున్నా.. శరీరంలోని మంట/వాపులను తగ్గించుకోవాలని భావిస్తున్నా.. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడమంత ఉత్తమమైన మార్గం లేదని అంటున్నారు చైనా, అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు.. కేలరీల నియంత్రణ ద్వారానే దీర్ఘాయుష్షు సాధ్యమన్న భావన వెనుక ఉన్న అసలు ప్రక్రియ ఏమిటిన్నది కూడా వీరు అధ్యయనపూర్వకంగా తెలుసుకున్నారు. ‘సెల్‌’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. 
(చదవండి: బరువు తగ్గాలంటే ఈ స్నాక్ తినాల్సిందే..)

వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సహజం. కేన్సర్, మతిమరుపు, జీవక్రియలు మందగించడం.. ఇలా బోలెడన్ని సమస్యలు వృద్ధాప్యాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యంపై పెట్టాల్సిన ఖర్చులు పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో సాల్క్స్‌ జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌ లేబొరేటరీకి చెందిన జువాన్‌ కార్లోస్‌ బెహమోంటే, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లోని ప్రొఫెసర్‌ గువాంగ్‌ హుయి ల్యూలు ఎలుకలపై కొన్ని పరిశోధనలు చేశారు. ఆహారాన్ని నియం త్రించినప్పుడు ఎలుకల కణాల్లో ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనల ఆధారంగా వృద్ధాప్య సమస్యలను అధిగమించేం దుకు మంచి మందులు తయారు చేయవచ్చునన్నది

వీరి అంచనా. తమ పరిశోధనల్లో భాగంగా బెహమోంటే కొన్ని ఎలుకలను ఎంచుకుని 30 శాతం తక్కువ కేలరీలు అందేలా చేశారు. వీటిని సాధారణ స్థాయిలో ఆహారం తీసుకుంటున్న ఎలుకలతో పోల్చి చూశారు. మొత్తం 56 ఎలుకల్లోని కొవ్వు, కాలేయ, కిడ్నీ, చర్మ, ఎముక మజ్జ, మెదడు, కండరం వంటి 40 రకాల కణాల్లోంచి లక్షా అరవై ఎనిమిది వేల కణాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కో కణంలోని జన్యుపరమైన చర్యలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు.. వయసు ఎక్కువవుతున్నప్పటికీ కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుక కణాల్లో మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. అంతేకాదు.. వీటి కణజాలం, కణాలు కూడా యుక్తవయసులో ఉండే ఎలుకలను పోలి ఉన్నాయి. 
(చదవండి: బరువు తగ్గేందుకు 12 సూత్రాలు)

కేలరీలు తక్కువగా తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా మంట/ వాపు, కొవ్వులు జీర్ణ ప్రక్రియలకు సంబంధించిన జన్యువులపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది. ఆహారం కారణంగా వైబీఎక్స్‌1 అనే ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫ్యాక్టర్‌ 23 రకాల మార్పులను నియంత్రించగలిగిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను కొత్త కొత్త మందులను తయారు చేసేందుకు వినియోగించనున్నట్లు బెహమోంటే తెలిపారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా