జాదవ్‌ కేసులో విచారణ ప్రారంభం

18 Feb, 2019 15:30 IST|Sakshi

హేగ్‌ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణ ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై 2016లో బెలూచిస్తాన్‌లో అరెస్టైన జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసులో తీర్పు వెలువరించే వరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం స్పష్టం చేసింది. జాదవ్‌ భారత్‌ గూఢచారిగా పాక్‌ పేర్కొంటుండగా, రిటైర్డ్‌ నేవీ అధికారి జాదవ్‌ను కిడ్నాప్‌ చేశారని భారత్‌ పేర్కొంటోంది. కాగా జాదవ్‌ కేసులో భారత్‌ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే అంతర్జాతీయ న్యాయస్ధానంలో వాదనలు వినిపిస్తున్నారు.

భారత్‌పై పాక్‌ దుష్ర్పచారం

భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు పాకిస్తాన్‌ న్యాయస్ధానాన్ని వాడుకుంటోందని సాల్వే ఆరోపించారు. జాదవ్‌కు మరణ శిక్ష విధిస్తూ పాకిస్తాన్‌ సైనిక కోర్టు చేపట్టిన విచారణ సరైన పద్ధతిలో సాగలేదని స్పష్టం చేశారు. కాన్సులర్‌ కస్టడీ లేకుండా జాదవ్‌ కస్టడీ కొనసాగింపు చట్టవిరుద్ధమని ప్రకటించాలని సాల్వే కోరారు. వాస్తవాలను వక్రీకరించడంలో పాకిస్తాన్‌ ఘనత విస్మరించలేనిదని చురకలు అంటించారు. జాదవ్‌ను దోషిగా తేల్చే ప్రక్రియలో ప్రత్యేక దశలను నిర్ధిష్టంగా వెల్లడించేందుకు పాకిస్తాన్‌ విముఖత వ్యక్తం చేస్తోందని సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు