అయ్యో పాపం.. ఎంత దీనస్థితి!

23 Jan, 2020 20:14 IST|Sakshi

సుడాన్‌: అడవికి రారాజు సింహం అంటారు. అలాంటి సింహం పేరు వినగానే దట్టమైన జూలు, దిట్టమైన శరీరాకృతితో ఊహాల్లోకి రాగానే వెన్నులో వణుకు పుడుతుంది. మృగరాజు గంభీరమైన గాండ్రింపు వినపడితే చాలు గుండెల్లో పిడుగు పడినంత పనవుతుంది. ఇక ఆఫ్రికా జాతి సింహాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని సినిమాల్లో చూసే అమ్మో అనుకుంటాం. ఆఫ్రికా దేశమైన సుడాన్‌లోని అల్‌ ఖురేషీ పార్క్‌లో సింహాలు దీనికి భిన్నంగా కన్పిస్తున్నాయి. వాటిని చూస్తే భయపడాల్సింది పోయి అసలు అవి సింహాలా లేక ఏవైనా పెద్ద జాతి పిల్లులా అనేలా తయారయ్యాయి. ఇక ఆ పార్కుకు వచ్చిన సందర్శకులకు వినోదం సంగతి అటుంచితే వాటిని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన ఆ సింహాల దీనస్థితిని చూసి తట్టుకోలేక ఓ సందర్శకుడు వాటి ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.  ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ సింహాలను చూసి నెటిజన్లంతా షాకవుతూ వాటి పరిస్థతిని చూసి జాలి పడుతున్నారు.

ఆర్థిక సంక్షోభంలో సూడాన్‌..
ప్రస్తుతం సూడాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కరెన్సీ కొరత అక్కడి ప్రజలను బాధిస్తోంది. సూడాన్‌లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవాలు కూడా ఆకలికి అలమటించి పోతున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్లోని అల్ ఖురేషి పార్క్‌లోని సింహాలకు అయితే కొన్ని వారాలుగా తినేందుకు తిండి కూడా లేదు. అంతేకాదు అనారోగ్యానికి గురైన సింహాలకు సరైన చికిత్స, మందులు అందుబాటులో లేవు. ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొచ్చి సింహాలు దీనంగా కన్పిస్తున్నాయి. ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవలేని పరిస్థితికి వచ్చాయి. ఒక సింహాన్ని అయితే తాడుతో కట్టేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడి మృగరాజుల దుస్థితి చూసి జంతు ప్రేమికులు చలించిపోతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు