‘మరణించిన గుండె’ల మార్పిడి!

25 Oct, 2014 03:34 IST|Sakshi
‘మరణించిన గుండె’ల మార్పిడి!

ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స
హార్ట్ ఇన్ ఎ బాక్స్ పరికరం సాయంతో గుండెకు పునరుజ్జీవం

 
 సిడ్నీ: ప్రపంచ వైద్య చరిత్రలోకెల్లా అత్యుద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత సంక్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సా విధానంలో నూతనాధ్యాయానికి తెరలేచింది. మరణించిన రోగి శరీరం నుంచి ఇతరులకు అమర్చేందుకు పనికిరానిదిగా భావించే ఏకైక అవయవమైన గుండెకు సైతం మరణం లేదని తేలింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చలనంలేని గుండెను పునరుజ్జీవింపజేయడం సాధ్యమని నిరూపణ అయింది. ఇప్పటివరకూ బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి ‘బతికున్న గుండె’లను (గుండెలు ఇంకా కొట్టుకుంటున్నప్పుడే) సేకరించి హృద్రోగులకు దాదాపు నాలుగు గంటల్లోగా అమర్చే పద్ధతి పలు దేశాల్లో అమల్లో ఉండగా అందుకు పూర్తి భిన్నంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘మరణించిన’ గుండెలను (కొట్టుకోవడం ఆగిపోయిన గుండెలను) ముగ్గురు హృద్రోగులకు విజయవంతంగా అమర్చింది.
 
 ముగ్గురు రోగులు మరణించి 20 నిమిషాలయ్యాక ఆ మృతదేహాల నుంచి సేకరించిన మూడు గుండెలను హృద్రోగులకు అమర్చి వారికి పునర్జన్మ ప్రసాదించింది. ఈ ఘనత సాధించిన వైద్య బృందంలో భారత సంతతి సర్జన్ కూడా ఉన్నారు. సిడ్నీలోని సెయిట్ విన్సెంట్ హాస్పిటల్‌కు వైద్యులు ఈ ఆపరేషన్ల కోసం ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ పరికరం సాయం తీసుకున్నారు. మరణించిన రోగుల నుంచి సేకరించిన గుండెలను తొలుత ఈ పరికరంలో భద్రపరిచి  అవి వెచ్చదనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరికరంలో గుండెలు తిరిగి కొట్టుకోవడాన్ని పునరుద్ధరింపజేశారు. ఈ క్రమంలో గుండె కండరానికి నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ఒక రకమైన పోషక ద్రావణాన్ని ఉపయోగించారు. ఆపై వాటిని ముగ్గురు రోగులకు శస్త్ర చికిత్సల ద్వారా అమర్చారు.

మరిన్ని వార్తలు