బిడ్డ చివరి క్షణాలు సేవకోసం..!

4 Apr, 2016 15:09 IST|Sakshi
బిడ్డ చివరి క్షణాలు సేవకోసం..!

జీవించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.. జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకోడానికి మనోనిబ్బరం కలిగి ఉండాలి. అదే విషయాన్ని నమ్మారు ఆ నూతన దంపతులు. తమకు పుట్టిన బిడ్డ కొన్ని గంటల్లోనే మరణిస్తాడని తెలిసినా కృశించిపోలేదు. తమ ఆవేదన మరెవ్వరికీ కలగకుండా ఉండాలంటే తాము నిరాశ చెందకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ బిడ్డతో చివరి క్షణాల్లో గడిపిన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు. ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో సేవలు పెంచేందుకు కావలసిన విరాళాల సేకరణ కోసం ఆ వీడియోను వినియోగించారు.

సిడ్నీకి చెందిన దంపతులు నాన్సీ, ఛార్లీ మెక్లీన్ తమకు బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషించారు. కానీ.. ఆ తర్వాత అతడు అత్యంత అరుదైన నాన్ కెటోటిక్ హైపర్ గ్లైసినేమియాతో జన్మించాడని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శరీరం అమెనో యాసిడ్లను తయారుచేయడాన్ని నిరోధించే ఈ పరిస్థితి దాపురించడంతో ఎడిసన్ ఊపిరి తీసుకునేందుకు కూడా వెంటిలేటర్ పైనే ఆధారపడాల్సిన స్థితికి చేరుకున్నాడు. అయితే ఎవ్వరూ తమ బిడ్డ చనిపోవాలని కోరుకోరు. కానీ అతడి స్థితిని తెలుసుకున్న తల్లిదండ్రులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటిలేటర్ తీస్తే బిడ్డ చనిపోతాడని తెలిసినా ఎడిసన్ పుట్టిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు చార్లీ, మెక్లీన్ వెంటిలేటర్ పై ఊపిరి అందించడాన్ని నిలిపివేశారు. ఏం చేసినా చనిపోతాడని తెలిసిన తర్వాత.. సొంత ఊపిరితో ఎంతకాలం బతుకుతాడో అంతే బతకనిచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ తమ బిడ్డ జన్మ మరెందరికో సహాయపడాలని నిర్థారించుకున్న ఆజంట.. గత సంవత్సరంలో తమ పెళ్లిఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ ను పిలిపించారు. ఎడిసన్ చివరి క్షణాల్లో తమతో గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు. అవే చిత్రాలను స్థానిక మిడ్వైవ్స్ అండ్ నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ సర్వీస్ లో మరిన్ని సేవలను పెంచేందుకు విరాళాల కోసం వినియోగించారు.  

క్రౌడ్ ఫండింగ్ పేరున ఓ పేజీని ఎడిసన్ జ్ఞాపకార్థం ప్రారంభించిన ఛార్లీ, మెక్లీన్.. తమ బిడ్డ తమకు మంచి పాఠం నేర్పించాడంటూ పేజీలో రాసుకున్నారు. ''మీరు ప్రేమించేవారిని ఆనందంగా ఉంచేందుకు ప్రతిక్షణం వినియోగించండి,  ప్రతిక్షణాన్ని చివరి క్షణంగా భావించి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి... మనకోసం ఏ క్షణం ఆగదు, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆనందంగా ఉండేందుకు, ఇతరులను సంతోషంగా ఉంచేందుకు వినియోగించండి'' అంటూ సూచించారు. తమ బిడ్డతో సంబంధం ఏడు రోజులే అయినా ఏడుజన్మల బంధంగా  భావించామని, ఆ సమయాన్ని ప్రేమ కోసమే వినియోగించామని అన్నారు. తమ ముద్దుల బిడ్డ జ్ఞాపకార్థం 20 వేల డాలర్ల వరకూ ఫండ్స్ సేకరించి రాయల్ ఉమెన్స్ హాస్పిటల్ మిడ్ వైవ్స్, నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కు అందించాలన్న ఆశయంతోనే ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6700 డాలర్ల వరకూ సేకరించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు