హృదయ విదారకం: కరోనా వ్యాధిగ్రస్తుల తుది వీడ్కోలు!

5 Feb, 2020 08:05 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బతో చైనాలోని పలు ప్రాంతాల్లో జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక వైరస్‌ సోకిన వ్యక్తులు పిట్టల్లా రాలిపోతుండటం అందరినీ కలిచివేస్తోంది. దీంతో కరోనా వ్యాధిగ్రస్తులు తాము బతుకుతామో లేదో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కరోనా వైరస్‌ సోకిన ఓ వృద్ధ దంపతుల (80 సంవత్సరాల వయస్సున్న జంట) వీడియో వైరల్‌గా మారింది. ప్రాణాల మీద ఆశున్నా, బతుకుతామన్న నమ్మకం లేదన్న నిరాశ వారి కళ్లల్లో గోచరిస్తోంది. ప్రతిక్షణం ఒక యుగంలా బతుకు వెళ్లదీస్తున్న ఈ దంపతులు ఆసుపత్రిలో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. చేయి పట్టుకుని చివరిసారిగా భారంగా మాట్లాడుకున్నారు. (కరోనా బారిన తండ్రి.. దివ్యాంగుడి దుర్మరణం!)

‘వారు కలుసుకోవడం ఇదే చివరిసారేమో’ అంటూ ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ హృదయ విదారక వీడియో నెటిజన్లు మనసును కలిచివేస్తోంది. ‘వాళ్ల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’, ‘ఇది ఎంతో విషాదకరమైన వీడియో. కానీ జీవితపు చివరి క్షణాల్లోనూ వారి మధ్య ఉన్న ప్రగాఢ ప్రేమను ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది’, ‘వాళ్ల బాధను మనం ఊహించలేము, తిరిగి కోలుకుంటే బాగుండు’ అని పలురకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కరోనా వైరస్‌ వల్ల చైనాలో ఇప్పటివరకు 490 మంది మరణించారు.
 

చదవండి: 

కరోనా కేసులు 20,522

మరిన్ని వార్తలు