రాత్రికి రాత్రే భారీ వర్షాలు, వరదలు!

4 Jul, 2020 10:41 IST|Sakshi

టోక్యో: రాత్రికి రాత్రే భారీ వర్షాలు, వరదలతో జపాన్‌లోని దక్షిణ ప్రాంతం అతలాకుతలమైంది. కుమా నది పొంగడంతో హితోయోషి పట్టణం నీట మునిగింది. శనివారం ఆకస్మిక వరదలతో ఇద్దరు మృతి చెందగా, దాదాపు 13 మంది గల్లంతయ్యారు. భారీ వరదలతో ఇళ్లల్లోకి వరదనీరు ప్రవహించింది. కార్లు, వాహనాలు నీటిలో దాదాపు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరద ముప్పు ఉన్న కుమమోటో, కాగోషిమా ప్రాంతాలకు చెందిన 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రధాని షింజో అబే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈమేరకు జపాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, టోక్యోకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్‌ వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటనను సవరించింది.
(భారీ వర్షాలు..రెడ్‌ అలర్ట్‌ జారీ!)

మరిన్ని వార్తలు