రష్యాతో భారీ రక్షణ బంధం

16 Oct, 2016 01:13 IST|Sakshi
రష్యాతో భారీ రక్షణ బంధం

మోదీ - పుతిన్ భేటీతో సహకారం బలోపేతం
- ‘ట్రయంఫ్’ క్షిపణి రక్షణ వ్యవస్థ సహా రూ. 60,000 కోట్లతో మూడు భారీ ఒప్పందాలు
- 4 గ్రిగోరోవిచ్ తరగతి యుద్ధనౌకల కొనుగోలు.. 200 కమోవ్ హెలికాప్టర్ల తయారీ
- ‘స్మార్ట్ సిటీ’ల్లో సహకారం, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో మరో 13 ఒప్పందాలు
కూడంకుళం అణు ప్లాంటులో మరో రెండు రియాక్టర్ల నిర్మాణానికి పచ్చజెండా
భారత్, రష్యాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం
ఉగ్రవాదంపై సత్వరమే బలమైన సమగ్ర అంతర్జాతీయ చట్టం: మోదీ, పుతిన్ పిలుపు
ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను ఏమాత్రం సహించరాదని అగ్రనేతల ఉద్ఘాటన
 
 బెనౌలిమ్(గోవా): భారత్ అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో మూడు భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది.  రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అలాగే.. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో ఏమాత్రం సహనం వహించరాదని పాత మిత్రులైన ఇరు దేశాలూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు శనివారం గోవాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడి సహా అనేక అంశాలపై చర్చించారు.

తర్వాత ఇద్దరి సమక్షంలో 16 ఒప్పందాలపై ఇరు పక్షాలూ సంతకాలు చేశాయి. మొత్తం 500 కోట్ల డాలర్లతో రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థలను కొనడంతో పాటు, అడ్మిరల్ గ్రిగోరోవిచ్ తరగతి (ప్రాజెక్ట్ 11356) నిర్దేశిత క్షిపణి రహస్య యుద్ధ నౌకల్ని నాలుగింటిని కొనడం(రూ. 20,016 కోట్లు) కమోవ్ హెలికాప్టర్ల తయారీ కోసం సంయుక్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. ఈ మూడు భారీ రక్షణ రంగ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్ ఇటీవల తన సైనిక స్థావరాలను అమెరికాకు అందుబాటులోకి తెస్తూ.. ఆ దేశంతో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. సంప్రదాయంగా రక్షణ భాగస్వామి అయిన రష్యా నుంచి దూరంగా జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్లు, అంతరిక్షం, స్మార్ట్ సిటీల వంటి రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలూ మూడు ప్రకటనలు చేశాయి.


 పాత మిత్రుడు ఉత్తమం: మోదీ
 చర్చల అనంతరం పుతిన్‌తో కలసి మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం’ అనే రష్యా సామెతను ఉటంకించారు. తద్వారా.. ఇటీవల పాక్‌తో సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించిన రష్యాకు పరోక్షంగా అసంతృప్తిని తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి భారత చర్యలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వడం పట్ల రష్యాకు మోదీ అభినందనలు తెలిపారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో సహనానికి తావుండరాదని తామిద్దరం ఉద్ఘాటించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్యా సన్నిహిత సహకారం ఉందని పుతిన్ పేర్కొన్నారు.

ఈ భేటీతో అత్యున్నత ఫలితాలు రావడం.. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యపు ప్రత్యేక, విశిష్ట స్వభావాన్ని విస్పష్టంగా చాటుతోందని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వాముల మధ్య సహకారాన్ని నెలకొల్పి అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతి ఏటా సైనిక పారిశ్రామిక సదస్సును నిర్వహించే అంశంపై కృషి చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. రష్యాలోని చమురు, సహజవాయువు రంగంలో భారత సంస్థలు గత 4 నెలలలోనే 550 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయని మోదీ చెప్పారు. దీని విస్తరణకు  భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే.. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం చేస్తామన్నారు. ఇరు దేశాలూ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్‌ను నెలకొల్పాలనీ నిర్ణయించినట్లు తెలిపారు.

 కూడంకుళంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం
 తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్‌ను మోదీ, పుతిన్‌లు జాతికి అంకితం చేశారు. 3, 4వ యూనిట్ల శంకుస్థాపనను వీక్షించారు. పౌర అణువిద్యుత్ రంగంలో సహకారాన్ని భారత్, రష్యాలు కొనసాగిస్తూ.. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటులో ఈ రెండు రియాక్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. అయితే ఆ ప్లాంటులో  5, 6వ యూనిట్ల నిర్మాణంపై జనరల్ ఎగ్రిమెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను, క్రెడిట్ ప్రొటోకాల్‌ను ఖరారు చేయలేకపోయాయి. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయి. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు త్వరగా సభ్యత్వం ఇవ్వాలన్న అంశానికి రష్యా బలంగా మద్దతునిస్తోందని, ఖండాంతర క్షిపణి వ్యాప్తి, క్షిపణి సాంకేతికత నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా హేగ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోకి భారత్ ప్రవేశాన్ని రష్యా ఆహ్వానించినట్లు ఇరుదేశాల సంయుక్త ప్రకటన తెలిపింది.  

 ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు.. సీమాంతర ఉగ్రవాదాన్ని  వ్యతిరేకిస్తూ.. ఉగ్రవాదులకు భద్రమైన స్థావరాలను నిరాకరించేందుకు చర్యలు చేపట్టాలని భారత్, రష్యాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానం (సీసీఐటీ)ని సత్వరమే పూర్తిచేయాలన్నాయి.  ఇరు దేశాల  సంయుక్త ప్రకటన ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ ఖండించింది. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం సహనం లేని సూత్రం ప్రాతిపదికగా, ద్వంద్వ ప్రమాణాలను పాటించకుండా బలమైన అంతర్జాతీయ చట్ట నిబంధనలను రూపొందించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి.

 ‘స్మార్ట్ సిటీ’ల్లో రష్యా ఐటీ పరిష్కారాలు... భారత ‘స్మార్ట్ సిటీ’ కార్యక్రమం అమలులో రష్యా సంస్థల ఐటీ పరిష్కారాలను ఉపయోగించుకోవడం కోసం ఆ దేశంతో ఒప్పందాలు చేసుకుంది.  జేఎస్‌సీ రూసిన్‌ఫామెక్సపర్ట్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, హోం శాఖ, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్, హరియాణా ప్రభుత్వాలకు మధ్య ఇవి జరిగాయి.  
 
 ఉగ్రవాదంపై విభేదాలొద్దు
 - చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ
 - ‘బ్రిక్స్’ సందర్భంగా ప్రత్యేక భేటీ
 
 బెనౌలిమ్(గోవా): ఏ ఒక్క దేశానికీ ఉగ్రవాద నష్టం నుంచి మినహాయింపు లేదనీ.. ఈ విషయంలో విభేదాలుండజాలవని ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా శనివారం జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విషయాన్ని స్పష్టం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్‌కు ఐక్యరాజ్యసమితి నిషేధం ముద్ర పడకుండా చైనా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్, చైనా దేశాలు రెండూ ఉగ్ర బాధిత దేశాలేనన్న మోదీ.. ఈ ప్రాంతంలో అస్థిరత  సృష్టించే యత్నాలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలను సహించేది లేదన్నారు. ఈ సమస్యను ఎదుర్కునేందుకు భారత్-చైనా దీర్ఘకాలం పనిచేసేందుకు సంయుక్త వేదికను ఏర్పాటుచేసి ముందుకెళ్లాలని జిన్‌పింగ్‌ను కోరారు. దీనికి అంగీకరించిన జిన్‌పింగ్ ఇరుదేశాలు ఉగ్రవాదవ్యతిరేక కార్యక్రమాలను, భద్రతపై చర్చలు, భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నట్లు విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారులు త్వరలో భేటీ కావాలని జిన్‌పింగ్ సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు.

 ‘ఎన్‌ఎస్‌జీ’పై త్వరలో భేటీ..: అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వంపై  భారత అధికారులు  మరోసారి చైనా అధికారులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జిన్‌పింగ్.. మోదీకి చెప్పారు. ఇది భారత్‌కు సహాయకరంగా ఉంటుందని జిన్‌పింగ్ చెప్పినట్లు స్వరూప్ తెలిపారు. భారత్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై చైనా అంత వ్యతిరేకంగా ఏమీ లేదని..  కొన్ని విషయాల్లో ఉన్న అభిప్రాయభేదాల వల్లే ఆలస్యమైందని.. త్వరలోనే అన్నీ సర్దుకునేలా సానుకూలంగానే జిన్‌పింగ్ వ్యాఖ్యలున్నాయని స్వరూప్ చెప్పారు.  
 
 ‘ట్రయంఫ్’తో భరోసా!

 రష్యాతో చేసుకున్న రక్షణ ఒప్పందాల్లో రూ.33,350 కోట్ల విలువైన ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఒప్పందం కీలకమైనది. 400 కి.మీ. పరిధి వరకూ దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లతో పాటు.. రహస్య విమానాలతోసహా శత్రు విమానాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం గల ఈ వ్యవస్థ.. భద్రతకు మంచి భరోసానిస్తుందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి వ్యవస్థలు ఐదింటిని కొనాలని భారత్ భావిస్తోంది.వీటితో భారత్ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ అధునాత భద్రతా వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు వెంట మూడింటిని, చైనా సరిహద్దు వెంట రెండింటిని మోహరించాలన్నది భారత్ ప్రణాళిక.

ఒక్కో ట్రయంఫ్ వ్యవస్థలో 8 లాంచర్లు, ఒక కంట్రోల్ సెంటర్, రాడార్, 16 క్షిపణులు ఉంటాయి. ఒక్కో వ్యవస్థకు 100 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. దీనికి 3 రకాల క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ఒక రక్షణ పొరను సృష్టించటం, అదే సమయంలో 36 లక్ష్యాలపై దాడి చేయగలగడం దీని ప్రత్యేకత. గంటకు 17,000 కి.మీ వేగంతో ఇది లక్ష్యాలపై దాడి చేయగలదు. ప్రపంచంలోని అన్ని విమానాల కన్నా ఇది అధిక వేగం. కాగా అడ్మిరల్ గ్రిగోరోవిచ్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందం కింద.. రెండు నౌకలను భారత్‌కు రష్యా అందిస్తుంది. మరో రెండింటిని రష్యా సాయంతో భారత్‌లోనే నిర్మిస్తారు.  కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం కింద  రూ. 6,672 కోట్లతో 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను రష్యా, భారత్‌లు కలసి భారత్‌లోనే తయారు చేస్తాయి.

మరిన్ని వార్తలు