ఈ 50 నగరాల్లోనే హింస ఎక్కువ

9 Mar, 2018 19:57 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచంలో హింస ఎక్కువగా ఉన్న నగరాలు ఏవన్న అంశంపై అధ్యయనం జరిపి 50 నగరాల జాబితాను రూపొందించగా వాటిలో మధ్య, దక్షిణ అమెరికాలకు చెందిన నగరాలే 42 ఉన్నట్లు తేలింది. లక్ష మంది జనాభాకు ఎంత మంది హత్యకు గురవుతున్నారన్న అంశం ఆధారంగా మెక్సికోకు చెందిన హింస వ్యతిరేక మేధావుల బృందం ఈ అధ్యయనం జరిపింది. మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన నగరంగా తేలగా వెనిజులాలోని కారకాస్, మెక్సికోని అకాపుల్కో నగరాలు ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి.

అమెరికాలోని సెయింట్‌ లూయీ, బాల్టీమోర్, న్యూ ఆర్లీన్స్, డెట్రాయిట్‌ నగరాలు, దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్, డర్బన్, నెల్సన్‌ మండేలా బే హింసాత్మక నగరాలు తేలాయి. జమైకా, హోండురస్, ప్యూటోరికా, కొలంబియా, ఎల్‌ సాల్వడార్, గౌతమాలా దేశాల నగరాలు కూడా ఈ జాబితాలో చేరాయి. గత ఏడాదితో పోలిస్తే హోండురస్‌లో హింసాత్మక సంఘటనలు ఈసారి బాగా తగ్గాయి. ఇందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని అధ్యయన నివేదిక పేర్కొంది. వెనిజులాలో 2017లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు ఎక్కువగా జరిగాయి. నికోలస్‌ మడురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు