ఈ బ్యాగ్ ఖరీదు కోటిన్నర

2 Jun, 2015 18:09 IST|Sakshi
ఈ బ్యాగ్ ఖరీదు కోటిన్నర

న్యూయార్క్: అరుదైన మొసలి చర్మంతో 18 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారు చేసిన బటన్లు అమర్చి అందంగా డిజైన్ చేసిన గులాబీ రంగు హ్యాండ్ బ్యాగ్ సోమవారం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌజ్‌లో ఏకంగా 1.46 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలను అభిమానులుగా కలిగిన ప్రపంచ ప్రసిద్ధ లెథర్ బ్యాగుల కంపెనీ హెర్మెస్ ఈ బ్యాగ్‌ను డిజైన్ చేసింది. హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ ట్యాగ్‌తో విడుదల చేసిన ఈ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొనుగోలు చేశారని, ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బ్యాగ్ అని క్రిస్టీ వేలం నిర్వాహకులు తెలిపారు. గతంలో హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ 1.29 కోట్లకు అమ్ముడు పోయిందని, ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టామని హెర్మెస్ కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

 

నల్ల రంగులో ఉన్న మరో బిర్కిన్ బ్యాగ్‌ను త్వరలో విడుదల చేయబోతున్నామని, అది ఇంతకన్న ఎక్కువ ధర పలుకుతుందని భావిస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి.


 ప్రపంచ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన బిర్కిన్ ట్యాగ్ బ్యాగ్‌లకు ఎంతో గిరాకీ ఉంది. ఈ బ్యాగ్‌ల కోసం కొన్నేళ్లపాటు నిరీక్షించే వినియోగదారులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ 1984లో అప్పటికి పాపులరైన ప్రముఖ ఫ్రెంచ్ నటి, సింగర్ జాన్ బెర్కిన్ పేరిట హ్యాండ్ బ్యాగ్ సిరీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఈ బ్యాగ్‌లను ఎగబడి కొంటున్నారు. ప్రముఖ మోడల్, సింగర్, డిజైనర్ విక్టోరియా బెకమ్ వద్ద ఈ బ్రాండ్ బ్యాగులు దాదాపు వంద ఉన్నాయట. కిమ్ కర్దాషియన్, హైదీ క్లమ్ లాంటి సెలబ్రిటీలు కూడా హెర్మెస్ బిర్కిన్ బ్యాగులే కొంటారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా