హైస్పీడ్‌ ఫ్లయిట్‌ ట్రైన్‌ 

13 Oct, 2018 03:05 IST|Sakshi

రైలు వేగం 1,000 కి.మీ. 

తయారు చేస్తున్న దేశం: చైనా 

ప్రాజెక్టుకు పేరు:టీ ఫ్లయిట్‌ 

అందుబాటులోకి వచ్చే సంవత్సరం 2025

చైనా, జపాన్‌ వంటి దేశాల్లోని బుల్లెట్‌ ట్రైన్లు గంటకు 350 కి.మీ. వేగంతో దూసుకుపోతున్నాయంటేనే అబ్బో అని ఆశ్చర్యపోతుంటాం. ఆ వేగాన్ని మనం ఎప్పుడు అందుకుంటామా అని ఆలోచన చేస్తాం. ఇక గంటకు 1000 కి.మీ. వేగంతో గమ్యస్థానాన్ని చేరుకునే కొత్త హైస్పీడ్‌ ఫ్లయిట్‌ ట్రైన్‌ వస్తుందంటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. 2025 కల్లా ఈ హైస్పీడ్‌ రైలు వాస్తవరూపం దాల్చనున్నట్లు చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో గంటకు 350 కి.మీ. వేగంతో వెళ్లే హైస్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్లున్నాయి.

ఈ బుల్లెట్‌ రైళ్ల వేగం మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటూనే ‘నెక్ట్స్‌ జనరేషన్‌ మ్యాగ్నటిక్‌ లీవియేషన్‌ ట్రైన్ల’పై పరిశోధనను ఉధృతం చేసింది. గత బుధవారం (అక్టోబర్‌ 10న) చెంగ్డూ నగరంలో జరిగిన నేషనల్‌ మాస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెనర్‌ వీక్‌’సందర్భంగా ఈ రైలు నమూనాను ప్రదర్శించారు. ప్రభుత్వ సంస్థ ‘చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’(కాసిక్‌) ఆధ్వర్యంలో 2015 నుంచే ‘టీ ఫ్లయిట్‌’పేరిట ఈ రైలు రూపొందించడంలో నిమగ్నమైంది. కాంతిని, వేడిని తట్టుకునేలా ఈ ఫ్లయిట్‌ కేబిన్‌ను తయారుచేస్తున్నట్లు గ్లోబల్‌టైమ్స్‌ వెల్లడించింది.  

అద్భుత సాంకేతికత.... 
మ్యాగ్నటిక్‌ లీవియేషన్‌ టెక్నాలజీ, ఇతర సాంకేతికతలు ఉపయోగించి భూమికి వంద మిల్లీమీటర్ల ఎత్తులో ఈ రైలు తేలుతూ వెళ్లేలా చేస్తారు. ఈ రైలు నెమ్మదిగా వేగం పుంజుకుని గంటకు వెయ్యి కి.మీ. లక్ష్యాన్ని చేరుకుంటుందని, ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదని వాంగ్‌ యాన్‌ అనే అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్, హైపర్‌లూప్‌ కంపెనీలు గంటకు వెయ్యి కి.మీ.ల కంటే వేగం వెళ్లగలిగే హైస్పీడ్‌ టెక్నాలజీని పరీక్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు ఫ్లయిట్‌ ట్రైన్‌ తయారీలో చైనా కూడా పోటీపడుతోంది. ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ వాడే సాంకేతికత మాదిరిగానే ఫ్లయిట్‌ ట్రైన్లలోనూ ‘ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ప్రొపల్షన్‌’టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా 22 వేల కి.మీ. మేర సుదీర్ఘ హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌ ఉన్న దేశంగా చైనా ముందుంది. 

మరిన్ని వార్తలు