223 అడుగుల ఎత్తులో ఫుట్పాత్

20 Oct, 2015 12:19 IST|Sakshi
223 అడుగుల ఎత్తులో ఫుట్పాత్

ప్రతి నిత్యం ఏదో ఒక కారణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనీయులు తాజాగా.. తమ సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పదును పెట్టారు. ప్రపంచంలోనే ఎత్తైన ఫుట్పాత్ నిర్మించి సంచలనం సృష్టించారు. నేలకు 223 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఫుట్పాత్ నైరుతీ చైనాలోని చోంగ్ పింగ్ నగరంలో ఉంది. ఒక అపార్ట్మెంట్, షాపింగ్మాల్ను కలుపుతూ ఈ నిర్మాణం జరిగింది.  

అపార్ట్మెంట్లోని ప్రజలు నేరుగా షాపింగ్ మాల్లోకి వెళ్లేలా ఈ ఫుట్పాత్ను రూపొందించామని..దీనివల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చే అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్లోని 22వ అంతస్తు నుంచి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జిని నిలిపి ఉంచేందుకు 75 అడుగుల పొడవు, 13 అగులు వెడల్పు ఉన్న 8 ఉక్కు కేబుల్స్ నిర్మించారు. బ్రిడ్జి పై నుంచి కిందికి చూసేందుకు విండోస్ వంటి కంతలను ఏర్పాటు చేశారు.

భూమికి అంత ఎత్తులో ఉన్న ఈ ఫుట్పాత్పై నడిచేందుకు భయం కలగటం లేదా అని అడిగితే.. ఎందుకు లేదూ ఇక్కడి నుంచి చూస్తే.. సరాసరి.. కింద ఉన్న కార్ పార్కింగ్ లాట్ కనిపిస్తుంది. కళ్లు తిరుగుతాయ్ అంటూ  అపార్ట్ మెంట్ వాసి చెంగ్ బదులిచ్చాడు. ఒక్కోసారి ఈ బ్రిడ్జి మీద నడవాలంటేనే భయంగా ఉందని ఆయన తెలిపాడు.

మరోవైపు అధికారులు మాత్రం ఇది ప్రపంచంలో కెల్లా కూలెస్ట్ బ్రిడ్జ్ అంటూ మురిసిపోతున్నారు. అంతేకాదు.. ఈ బ్రిడ్జివల్ల బోలెడు సమయం కలిసొస్తుందని అంటున్నారు.  రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోవటంతో  దాన్ని దాటుకుని షాపింగ్ మాల్ లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతోందని.. ఈ షార్ట్ కట్ బాగుందని యూత్ చెబుతున్నారు. ఈ కూల్ ఫుట్పాత్ గత ఏడాది డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు