కుప్పకూలిన బ్రిడ్జి.. 22 మంది మృతి

14 Aug, 2018 18:34 IST|Sakshi

రోమ్‌ : ఇటలీలోని జెనోవా సిటీలో విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జి పక్కనే ఉన్న ఇళ్లపై పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం కాస్త అయినా తగ్గిందని రవాణా శాఖ మంత్రి ఆనిలో టోనినెల్లి ట్వీట్‌ చేశారు. 

జెనోవా ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్న మోరాండి బ్రిడ్జిని 1960లో నిర్మించారు. గతంలో కొన్ని రోజులు మూసివేసిన అనంతరం 2016లో మరమ్మతులు చేపట్టి మళ్లీ బ్రడ్జిని ఓపెన్‌ చేశారు. అప్పటినుంచి వేలాది వాహనాదారులు ఈ బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అయితే సుమారు ఐదు దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ఈ పురాతన బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోవడాన్ని ప్రకృతి విపత్తుగా పరిగణించాలా లేదా దీని వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు