హిల్లరీ ఓ దొంగ, బలహీనురాలు

4 Jun, 2016 12:14 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పనిచెప్పారు. వివాదాస్పదుడిగా ముద్రపడిన ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై ఘాటైన పదజాలంతో విమర్శించారు. హిల్లరీ దొంగ అని, ఈ మెయిల్ కుంభకోణంలో ఆమెను జైల్లో పెట్టాలని ట్రంప్ అన్నారు.

'హిల్లరీ బలహీనురాలు. ఆమె దొంగ. రాసిచ్చిన ప్రసంగాన్ని చెబుతుంది. ఈమెయిల్ కుంభకోణంలో హిల్లరీ జైల్లో ఉండాలి. మన జాతీయ సెక్యూరిటీ విషయంలో ఆమె ఏం చేశారు? ఆమె నిస్సహాయురాలు' అని కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ విమర్శించారు.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులుగా ట్రంప్, హిల్లరీ దాదాపు ఖరారు కావడంతో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. పరస్పరం ఘాటైన విమర్శలకు పదునుపెడుతున్నారు. కాలిఫోర్నియాలో ఎన్నికల ర్యాలీలోనే హిల్లరీ మాట్లాడుతూ.. ట్రంప్ను నియంతతో పోల్చారు. మనం అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కాని నియంతను కాదని విమర్శించారు.

మరిన్ని వార్తలు