హిల్లరీ చెప్పిన కాసేపటికే దాడి!

7 Apr, 2017 12:14 IST|Sakshi
హిల్లరీ చెప్పిన కాసేపటికే దాడి!

సిరియాలోని వైమానిక స్థావరం మీద అమెరికా తన యుద్ధ విమానాల నుంచి తోమహాక్ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు హిల్లరీ క్లింటన్ ఎన్‌బీసీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలని చెప్పారు. ఆ దేశంలో చాలావరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను మనం స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆ తర్వాత కాసేపటికే సిరియా వైమానిక స్థావరంపై తోమహాక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి.

కాంగ్రెస్ అనుమతి లేకుండానే...
వాస్తవానికి అమెరికా తరఫున ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నా అందుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, సిరియా మీద దాడి విషయంలో డోనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకుముందు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా దాడులు చేసినా, అప్పట్లో మాత్రం కాంగ్రెస్‌లో విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగారు.

ఆరుగురు సైనికుల మృతి
అమెరికా క్షిపణి దాడుల్లో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మరణించారని సిరియా చెబుతోంది. షైరత్ వైమానిక స్థావరంపై దాదాపు 60 తోమహాక్ క్షిపణులను అమెరికా మధ్యధరా సముద్రంలోని తన యుద్ధ నౌకల నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు మరణించినట్లు సిరియా అంటోంది. వాస్తవానికి తాము ఈ వైమానిక స్థావరాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై దాడి కోసం ఉపయోగిస్తున్నామని, ఇలాంటి స్థావరాన్ని అమెరికా ధ్వంసం చేసిందని సిరియా వాదిస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పాత్రికేయులు కూడా సమర్థిస్తున్నారు. సిరియాలో చాలా వైమానిక స్థావరాలు ఉండగా, అమెరికా మాత్రం కేవలం సిరియా వైమానిక దళం ఐసిస్ మీద దాడులకు ఉపయోగించే ఏకైక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియాకు చెందిన అల్ మస్దర్ న్యూస్ సీఈవో లీత్ అబూ ఫదెల్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇప్పుడు సిరియాను అల్ కాయిదాకు వెండి పళ్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్నారని రక్షణ రంగ నిపుణుడు హైదర్ సుమేరి వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు