హిందూ దేవాలయం ధ్వంసం 

6 Feb, 2019 20:59 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను, పవిత్ర గ్రంథాలకు నిప్పంటించారు. ఈ ఘటనపై ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఖైర్‌పూర్‌ జిల్లాలోని కుంబ్‌లో గత వారం ఈ ఘటన జరిగింది. అయితే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ట్విటర్‌ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రావిన్స్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఖురాన్‌కు పూర్తి వ్యతిరేకమైన చర్యలన్నారు.

ఇప్పటికే ఆలయం ధ్వంసమైన కేసులో అక్కడి హిందూ సమాజం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. హిందూ దేవాలయాల సంరక్షణ కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్‌ హిందూ కౌన్సిల్‌ అడ్వైజర్‌ రాజేష్‌ కుమార్‌ హర్‌దాసాని డిమాండ్‌ చేశారు. గుడిపై దాడి చేసిన వారి కోసం వెతుకుతున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. 22 కోట్ల పాకిస్తాన్‌ జనాభాలో హిందువులు రెండు శాతం ఉన్నారు. అందులో ఈ సింధ్‌ ప్రావిన్స్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు