పాక్‌ సెనెట్‌కు హిందూ మహిళ

5 Mar, 2018 02:17 IST|Sakshi
కృష్ణకుమారి కోల్హీ

చరిత్ర సృష్టించిన కృష్ణకుమారి కోల్హీ

కరాచి: పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కోల్హీ చరిత్ర సృష్టించారు. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్స్‌లోని థార్‌ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్‌ గ్రామానికి చెందిన కోల్హీ (39).. ఆ ప్రావిన్స్‌లోని రిజర్వ్‌ స్థానానికి బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు.

పాక్‌లో మైనార్టీలకు హక్కులున్నాయని తెలిపేందుకు కోల్హీ గెలుపే నిదర్శనమని భుట్టో పేర్కొన్నారు.  కోల్హీ మాట్లాడుతూ.. ‘నేనో మానవ హక్కుల కార్యకర్తను. మైనార్టీలు.. ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తు న్నా. ఈ స్థానంలో మరో మహిళను కూడా పీపీపీ నామినేట్‌ చేసి ఉండొచ్చు. కానీ మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు.

మూడేళ్లు జైల్లో..
1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కోల్హీ.. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్‌ జైలులో బానిసగా జీవించారు. ‘నేను, నా కుటుంబం, బంధువులు ఉమర్‌కోట్‌లోని ఓ భూస్వామికి చెందిన ప్రైవేటు జైల్లో బానిసలుగా ఉన్నాం. ఆ ప్రాంతంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడ్డాం’ అని కోల్హీ చెప్పారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు. 16 ఏళ్ల వయసులో 9వ గ్రేడ్‌ చదువుతున్నపుడు లాల్‌ చంద్‌ను కోల్హీ వివాహమాడారు. 2013లో సింధ్‌ వర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు