డిప్రెషన్‌తో కుచించుకు పోయే మెదడు

6 Jul, 2015 10:22 IST|Sakshi
డిప్రెషన్‌తో కుచించుకు పోయే మెదడు

వాషింగ్టన్: దీర్ఘకాలికంగా, తరచూ డిప్రెషన్‌కు గురయ్యే వారి మెదడులోని కీలక భాగమైన హిప్పోకాంపస్ కుచించుకు పోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జ్ఞాపకాలు, భావోద్వేగాల విషయంలో హిప్పోకాంపస్ కీలక పాత్ర పోషిస్తుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచి స్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులు మెదడుపై డిప్రెషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై అధ్యయనం చేశారు. దాదాపు 9వేల మంది బాధితుల్ని వీరు పరిశీలించారు. వారి మెదడులోని హిప్పోకాంపస్ క్రమంగా తగ్గుతున్నట్లు వారు గుర్తించారు.

తొలిదశ డిప్రెషన్ లో ఉన్న వారి హిప్పోకాంపస్ సాధారణ పరిమాణంలో ఉంటే దీని ప్రభావానికి గురైన కొంతకాలానికి అది తక్కువ పరి మాణంలో కనిపించింది. ఇలాంటి వారి మెదడులోని ఈ భాగం చాలా చిన్నగా ఉంది. హిప్పోకాంపస్ కుచించుకు పోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు త్వరగా చికిత్స తీసుకోవడం వల్ల మెదడు పరిమాణం తగ్గకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, డిప్రెషన్‌ను అధిగమించేందుకు వారు తగిన వైద్య సహాయం పొందాలని పరిశోధకులు తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వైద్య పరమైన చికిత్సే కాకుండా సామాజికంగా కూడా ప్రోత్సాహం అవసరం అని వారి భావన.

మరిన్ని వార్తలు