సరిహద్దుల్లో శాంతి మేఘం : కిమ్‌తో ట్రంప్‌ భేటీ

30 Jun, 2019 15:12 IST|Sakshi

సియోల్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య ఆదివారం చారిత్రాత్మక భేటీ జరిగింది. ఉభయ కొరియాల సరిహద్దు ప్రాంతంలోని పముజోమ్‌ గ్రామంలో ఇరువురు నేతలు చేతులు కలిపారు. ట్రంప్‌, కిమ్‌ల భేటీ అనంతరం అగ్ర దేశాధినేత వెనుదిరిగే ముందు ఉత్తర కొరియా భూభాగంలోకి అడుగులు వేశారు. వియత్నాంలోని హనోయ్‌లో ఫిబ్రవరి సదస్సులో ఇరువురు నేతల మధ్య చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయిన అనంతరం వీరు తిరిగి కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం​ గమనార్హం.

దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ట్రంప్‌ కిమ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉభయ కొరియాలను విడదీసే సైనికేతర జోన్‌ (డీఎంజెడ్‌)ను దాటడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొనగా, ఇది చారిత్రక ఘటనని కిమ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కిమ్‌ను అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ట్రంప్‌ కోరారు. అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంపై కిమ్‌ స్పందన ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని కిమ్‌ మన్నిస్తే అమెరికాను ఓ ఉత్తర కొరియా నేత సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది. ట్రంప్‌, కిమ్‌ల భేటీ అనంతరం ఇరువురు నేతలు దక్షిణ కొరియా వైపు అడుగులు వేశారు.

కాగా అంతకుముందు ట్రంప్‌ కిమ్‌ను ఉద్దేశించి ‘మీ ఇంటికొస్తా. మీ భూభాగంలో అడుగు పెడతా. హలో అని పలకరిస్తా. కరచాలనం చేస్తా. రెండు నిమిషాలు మాట్లాడినా చాలు’ అని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌కి ట్విట్టర్‌ ద్వారా సందేశం పంపిన సంగతి తెలిసిందే.  ట్రంప్‌ ట్విట్టర్‌లో చర్చలకు రమ్మంటూ కిమ్‌ని ఆహ్వానించడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 

>
మరిన్ని వార్తలు