చరిత్ర మరవలేని వలసలు..

21 Jun, 2018 23:44 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశాలు.. ఒకటి వాణిజ్యయుద్ధం, రెండు వలస విధానం. రెండింటికీ అమెరికా తీరే కారణం. మరీ ముఖ్యంగా వలసదారులపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న పద్ధతి విమర్శల పాలవుతోంది. తమ దేశంలోకి అక్రమంగా వచ్చారంటూ లక్షలాది మెక్సికన్లను బలవంతంగా స్వదేశానికో, జైళ్లకో పంపిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం.. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడంపై మిగిలిన దేశాలు మండిపడుతున్నాయి. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన ట్రంప్‌.. దాన్ని సరిదిద్ధుకునేలోపే అమెరికా వ్యవహరించిన తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చరిత్రలో ఇప్పటి వరకు  చోటుచేసుకున్న కొన్ని వలసల గురించి తెలుసుకుందాం... 

ప్రపంచ గతిని మార్చివేయడంలో వలసలూ కీలకపాత్ర వహించాయి. ఉపాధి, విద్య, వైద్యం, మెరుగైన అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలివెళ్లడాన్నే వలస అంటారు. పక్షలూ జంతువులు సైతం ఆహారం కోసం వలస వెళ్లడం శతాబ్దాల నుంచి జరుగుతున్న జీవన క్రమమే. స్వచ్ఛందంగా జరిగిన వలసల సంగతి అటుంచితే.. యుద్ధం, అంతర్యుద్ధం, రాజకీయ కారణాలు, ప్రభుత్వ విధానాల వల్లనూ వలసలు చోటుచేసుకున్నాయి/ చోటుచేసుకుం టున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది..

సిరియా అంతర్యుద్ధం
సిరియాలో ఇప్పటికీ జరుగుతున్న అంతర్యుద్ధం మానవ హక్కుల హననంతోపాటు లక్షలాది సిరియన్లు ప్రాణభయంతో ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కారణమవుతోంది. 2011 మార్చిలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దళాలకు మధ్య మొదలైన పోరాటంలో రెండు వైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. అంతకు రెట్టింపు సంఖ్యలో సిరియన్లు సరిహద్దు దాటి టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌ తదితర యూరోప్‌ దేశాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో సముద్రాలు, ముళ్ల కంచెలు దాటుతూ వేలాది మంది మృత్యుపాలయ్యారు. ఇలా సముద్రం దాటుతూ మృత్యు తీరాన్ని చేరిన అలెన్‌ కుర్దీ అనే చిన్నపిల్లాడి ఫొటో రెండేళ్ల కిందట ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. ఒక అంచనా ప్రకారం సిరియా అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకు వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15కోట్లు. 

మెక్సికన్ల వలస
అమెరికాకు ఆనుకొని ఉండే మెక్సికో నుంచి అగ్రరాజ్యానికి 20వ శతాబ్దం ప్రారంభం నుంచే వలసలు మొదలయ్యాయి. స్వదేశంలో రాజకీయ అస్థిరత, సరైన ఉపాధి, మెరుగైన అవకాశాలు లేక లక్షలాది మెక్సికన్లు అమెరికా బాట పట్టారు. ఇప్పటికీ ఇలా వెళుతూనే ఉన్నారు. వీరిని అడ్డుకోవడానికి అగ్రరాజ్యం చేయని ప్రయత్నమంటూ లేదు. మెక్సికో సరిహద్దులో దాదాపు సగం మేర గోడను నిర్మించినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు రెండున్నర కోట్ల మెక్సికన్లు అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపణ. 

భారతదేశ విభజన..
ఇది భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటి. రెండు శతాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన ఆంగ్లేయులు.. స్వాతంత్య్రం ఇచ్చి వెళుతూ మతం ఆధారంగా దేశం రెండు ముక్కలయ్యేందుకు కారణమయ్యారు. దీంతో దేశానికి తూర్పు, పడమర(ఇప్పటి బంగ్లాదేశ్‌)లో ఏర్పడిన పాకిస్థాన్‌కు ముస్లింలు, అక్కడి నుంచి హిందువులు, సిక్కులు, బౌద్ధులు తదితర మతాల వాళ్లు భారత్‌కు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుమారు 15 కోట్లు మంది వలస వెళ్లగా, వలసల కారణంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 10లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు.

ఇజ్రాయెల్‌ ఏర్పాటు.. 
ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసిన యూదులకు ఇచ్చిన మాట ప్రకారం బ్రిటన్, అమెరికా కలసి ఐక్యరాజ్యసమితి సహకారంతో ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏర్పాటుచేశాయి. పాలస్తీనాకు సమీపంలోని కొంతభాగాన్ని యూదులకు ప్రత్యేక దేశంగా గుర్తించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్లో చాలా మంది తమ ఆస్తులు సైతం వదులుకొని ఇజ్రాయెల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ‘అలియా’ పేరుతో సాగిన ఈ వలసల్లో ఇప్పటివరకూ దాదాపు 40లక్షల మంది యూదులు ఇజ్రాయెల్‌కు వచ్చినట్లు అంచనా. 

బానిసలుగా నల్లజాతీయుల తరలింపు..
చరిత్రలో అత్యంత అమానవీయకర తరలింపు ఇది. అంగోలా, కాంగో, కామెరూన్, నైజీరియా, తదితర పశ్చిమాఫ్రికా దేశాల నుంచి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా కొనుక్కున్న బ్రిటన్, ఫ్రెంచ్, డచ్, అమెరికన్లు.. వారిని ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు తరలించారు. అక్కడి తోటలు, కర్మాగారాలు, ఇళ్లలో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. 15వ–19వ శతాబ్దాల మధ్యలో ఇలా బానిసలుగా మార్చి తీసుకుపోయే వ్యాపారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాలక్రమంలో ఇదే అమెరికాలో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు కారణమైంది.

మరికొన్ని ముఖ్యమైన వలసలు
1. చైనాలో 1948లో ఏర్పడిన మావో జెడాంగ్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం తమ వ్యతిరేకులందరినీ తైవాన్‌ పారియేలా చేసింది. దీంతో దాదాపు 20లక్షల మంది వలస వెళ్లారు. 
2. అమెరికాతో యుద్ధం సమయంలో 15లక్షల మంది వియత్నాం వాసులు వివిధ దేశాలకు వలస వెళ్లారు.  
3. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీకి సహాయం చేశారని ఆరోపిస్తూ అప్పటి సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం 1944లో తమ దేశంలోని సుమారు 7 లక్షల మంది చెచెన్యా ప్రాంత వాసులను బలవంతంగా వలస వెళ్లేలా చేసింది.  
4. 1979లో ఆఫ్గనిస్థాన్‌పై రష్యా దాడి చేయడంతో సుమారు 30లక్షల మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. 
5. బ్రిటన్‌లో నివసించే పురిటన్లు(క్రైస్తవుల్లో ఒక వర్గం) 1620–1640 మధ్య అప్పటి బ్రిటిష్‌ రాజులు కింగ్‌ జేమ్స్‌–1, కింగ్‌ చార్లెస్‌–1 హయాంలో అమెరికాకు వలస వెళ్లారు. తమపై దాడి భయమే దీనికి కారణం.   

మరిన్ని వార్తలు