మరణమా?.. హెచ్‌ఐవీతోనా?

5 Oct, 2018 04:33 IST|Sakshi

ఎయిడ్స్‌ రోగి నుంచి ఆమె బిడ్డకు కాలేయ మార్పిడి

సందిగ్ధ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా వైద్యుల సాహసోపేత నిర్ణయం 

జోహన్నెస్‌బర్గ్‌: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్‌ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్‌ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్‌ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్‌ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్‌ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్‌ డొనాల్డ్‌ గోర్డాన్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు ‘ఎయిడ్స్‌’ అనే జర్నల్‌లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్‌ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్‌ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్‌ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్‌ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో  సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.        
 

మరిన్ని వార్తలు