ఆట మధ్యలోనూ అమ్మతనం చాటింది..

1 Apr, 2018 16:47 IST|Sakshi

అల్బర్టా : ఎనిమిది వారాల కిందట పాపకు జన్మనిచ్చిన కెనడా హాకీ క్రీడాకారిణి సారా స్మల్‌కు ఓ సమస్య ఎదురైంది. ఇటీవల ఓ హాకీ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె తనతోపాటు పాలిచ్చే బ్రెస్ట్‌ పంప్‌ తీసుకెళ్లడం మరచిపోయింది. విరామ సమయంలో డ్రెసింగ్‌ రూమ్‌కి వచ్చిన ఆమె తన చిన్ని పాప పాలకోసం ఏడవటం చూసి క్షణం కూడా ఆలోచించకుండా టీషర్ట్‌ తీసివేసి బిడ్డకు స్తన్యమిచ్చారు. తల్లిప్రేమను చాటుతూ ఆట మధ్యలో ఆమె పాలిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తన బిడ్డకు పాలిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోను  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆమె.. ‘ఓ తల్లిగా చాలా గర్వపడుతున్నాను. నా బిడ్డ అవసరాలు తీర్చడంతో నాకు ఏదో సాధించాననే ఆనందం కలిగింది. మీరు కూడా మీకు నచ్చిన పనిచేయండి. బయటివారి గురించి ఆలోచించకుండా మీ పిల్లలకు స్తన్యమివ్వండి. మీ పిల్లలకు మరింత చేరువ అవ్వండి’  అని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఆమె చూపిన మాతృప్రేమను అభినందిస్తున్నారు. కొంతమంది వికృతమైన కామెంట్లు కూడా పెడుతున్నారు.

తల్లి కావడమే మహిళకు జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం. బిడ్డ కోసం నవమాసాలు మోసి ఎన్ని సమస్యలు ఎదురయినా తట్టుకునే మహిళలు, తమ పిల్లలు పాలకోసం అలమటిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వారు ఎక్కడున్నా పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన ఓ హీరోయిన్‌ బిడ్డకు పాలిస్తూ ఫొటోషూట్‌ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు స్తన్యమివ్వడం నేరం కాదు. బిడ్డ ఏడ్వగానే ఆ బుజ్జీ కడుపును నింపాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. ఈ విషయంలోనూ సామాజికంగా ప్రతికూల ఆలోచనలు ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడంలో మాతృత్వం కల్పించే గొప్ప వరం.. దానిని కూడా సంకుచిత దృష్టితో చూడవద్దని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు