ఈ వీడియో పీడకలగా వస్తుందేమో!

11 Apr, 2017 19:00 IST|Sakshi

సిడ్నీ: ఈ వీడియో చూసిన చాలామంది తల్లిదండ్రులకు పీడకలగా వస్తుందేమో. తమ పిల్లల గురించి వారు కూడా తెగ ఆందోళన పడిపోతారేమో. ఇంతకీ ఆ వీడియో ఏమిటని అనుకుంటున్నారా..! రైలు ఎక్కేటప్పుడు తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పేందుకు ఉదాహరణే ఈ వీడియో. తన తాతా, బామ్మ, సోదరితో కలిసి బుడి బుడి అడుగులు వేసుకుంటూ రైల్వే ప్లాట్‌ఫాం పైకెళ్లిన ఓ రెండేళ్ల ఏడెన్‌ అనే బుడతడు అనూహ్యంగా రైలెక్కేసమయంలో జారి రైలు కిందపడిపోయాడు.

రెండేళ్ల పిల్లాడు సహజంగానే సన్నగా ఉంటాడు కాబట్టి ప్లాట్‌ఫాం రైలుకు మధ్య ఉన్న సందులో నుంచి జారిపడిపోయాడు. దీంతో హడలిపోయిన ఆ తాతా బామ్మలు వెంటనే రైలుకు సిగ్నల్‌ ఇచ్చే వ్యక్తి ఆపండి అంటూ భయంతో అరిచి చేతులూపారు. ఆ వెంటనే తాత సమయస్ఫూర్తితో వ్యవహరించి అక్కడే మొకాళ్లపై కూర్చుని పిల్లాడిని జాగ్రత్తగా పైకి తీశాడు. ఆ తర్వాత రైల్వే సిగ్నలింగ్‌ అధికారి కూడా వారిని సమీపించి బాబుకు ఏం కాలేదుగా అని తడిమి చూసి జాగ్రత్త చెప్పి వెళ్లిపోయాడు. గత ఏడాది సిడ్నీలోని క్రోనుల్లా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడది బయటకు వచ్చి ఆన్‌లైన్‌లో హల్‌ చేస్తోంది. కొంతమందైతే తొలుత భయంతో వణికిపోయి తర్వాత హమ్మయ్య అనుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు