తిన్నది అరిగిందో లేదో చూడాలని..

23 May, 2014 04:00 IST|Sakshi
తిన్నది అరిగిందో లేదో చూడాలని..

చిత్రంలో రెండు ఆవులు, వాటి వీపులపై రంధ్రంతో ఉన్న గొట్టాలు అమర్చి ఉండటం చూస్తున్నారు కదా.. ఆ ఆవులు తింటున్న గడ్డి, దాణా ఎంతమేరకు అరుగుతుందో తెలుసుకుందామనే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను అమర్చారు! ఎనిమిది అంగుళాల రంధ్రంతో ఉన్న ఈ గొట్టాలు నేరుగా వాటి జీర్ణాశయంలోని ఓ గదిలోకి తెరుచుకుని ఉంటాయి. అంటే ఒకరకంగా ఆ ఆవుల కడుపులకు ఇవి కిటికీల వంటివన్నమాట. వీటిలోంచి చూస్తే.. ఆవుల కడుపులో మేత ఎంతవరకూ అరిగిందో కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ గొట్టంలోంచి కొంత మేతను సేకరించి పరీక్షలు చేయడం ద్వారా అది ఆవుకు ఎంత మేలైన ఆహారమో కూడా అంచనా వేస్తారు.

  స్విట్జర్లాండ్ ప్రభుత్వ పరిశోధన సంస్థ ‘అగ్రోస్కోప్’ శాస్త్రవేత్తలు ఇలా 14 ఆవులకు కాన్వులాస్ అనే ఈ గొట్టాలను అమర్చారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు అమెరికాలో కూడా ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అయితే నోరులేని అమాయకపు జంతువులను ఇలా ప్రయోగాల పేరుతో హింసించడం క్రూరమైన చర్య అంటూ.. జంతుహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నా.. గోమాతల మేలు కోసమే ఈ ప్రయోగం చేస్తున్నామని శాస్త్రవేత్తలు బదులిస్తున్నారు. ఆవులకు ఏది మంచి ఆహారమో నిర్ణయించి, ఆ ఆహారాన్నే ఇవ్వడం ద్వారా వాటికి ఆరోగ్యాన్ని, ఆయువునూ ఇవ్వవచ్చని చెబుతున్నారు. అన్నట్టూ.. పశువులపై ఇలాంటి ప్రయోగాలు 1833లోనే మొదలయ్యాయట.

మరిన్ని వార్తలు