శునకానికి ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు

8 Oct, 2016 11:35 IST|Sakshi
శునకానికి ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు

శాన్ ఫ్రాన్సిస్కో: అప్రమత్తతతో వ్యవహరించి, యజమాని ఇంటిని అగ్నిప్రమాదం నుంచి  కాపాడిన ఓ శునకానికి అమెరికాలోని మెరీడియన్ నగరం అందించే ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు దక్కింది. సాధారణంగా మనుషులకు మాత్రమే అందించే ఈ అవార్డును ఈసారి శునకానికి ఇవ్వడం విశేషం.  మెరీడియన్ సిటీలో ఉండే టాడ్‌ లావోయ్, జాక్సన్ అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.  ఆగస్టు 29న అర్ధరాత్రి టాడ్‌ ఇంటిలో విద్యుత్‌ తీగలు కాలిపోవడంతో అంతటా మంటలు వ్యాపించడం ప్రారంభించాయి.

దీన్ని గమనించిన జాక్సన్, వింతైన, అసాధారణ శబ్దంతో గట్టిగా అరిచింది. ఈ కుక్క కేకలు విన్న యజమాని టాడ్‌ లేచి చూసేసరికి మంటలు కనిపించాయి. వెంటనే  ఇంట్లోని అగ్నిమాపక సిలిండర్‌ సాయంతో మంటలు ఆర్పేయడంతోపాటు, పవర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. జాక్సన్ మొరగకపోతే, పెద్ద ప్రమాదం జరిగేదని, దాని వల్లే తమ కుటుంబం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని టాడ్‌ చెప్పారు. జాక్సన్ తన చాకచక్యంతో నగరంలోని ఓ కుటుంబాన్ని కాపాడడంతో, మెరీడియన్ సిటీ మేయర్‌ టామ్మీ డే ఈ శునకానికి ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు అందజేశారు.

మరిన్ని వార్తలు