మాల్‌లో రెచ్చిపోయిన నిరసనకారులు

4 Nov, 2019 09:27 IST|Sakshi

హాంకాంగ్‌ : హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. షాపింగ్‌ మాల్‌లో నిరసనకారుల ప్రదర్శన విధ్వంసకాండకు దారితీసింది. కత్తితో ఓ వ్యక్తి విరుచుకుపడటంతో పలువురు గాయపడ్డారు. ఘర్షణల్లో రాజకీయ నేత చెవికి తీవ్ర గాయమైంది. టైకూషింగ్‌ నగరంలోని సిటీప్లాజా ఆందోళనకారులు పోలీసులు బాహాబాహీకి దిగడంతో రక్తసిక్తమైంది. ఘర్షణలతో మాల్‌లోని ఎస్కలేటర్లపై నిరసనకారులు, మహిళలు, చిన్నారులు పరుగులు పెట్టారు.1997 లో చైనా గుప్పిట్లోకి వచ్చిన మాజీ బ్రిటిష్ కాలనీలో చైనా జోక్యం చేసుకోవడాన్ని ఆగ్రహించిన హాంకాంగ్ ప్రజలు వారాంతాల్లో భారీ నిరసనలకు దిగుతున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా సిటీప్లాజా మాల్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు మాల్‌లోని రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. వైట్‌ టీషర్ట్‌ వేసుకున్న వ్యక్తి కత్తితో  దాడి చేశాడన్న అనుమానంతో పలువురు అతడిని చితకబాదారు. మాల్‌ వెలుపల పేవ్‌మెంట్‌పై మరో వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో డెముక్రటిక్‌ జిల్లా కౌన్సిలర్‌ అండ్రూ చూ ఉన్నారని, ఆయన చెవి నుంచి రక్తం కారుతోందని తెలిపారు. భాష్పవాయు గోళాలతో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.

మరిన్ని వార్తలు