20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌

18 Jun, 2019 17:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మోజస్‌ వస్తుంటే ఆయనకు దారి వదులుతూ ఎర్ర సముద్రం నిలువునా చీలినట్లు అంబులెన్స్‌కు దారి ఇస్తూ లక్షలాది ప్రజలు పక్కకు తప్పుకున్నారు. హాంకాంగ్‌ ప్రజలేమీ గూండాలు కాదు’ అనే వ్యాఖ్యతో ఓ పౌరుడు అప్‌లోడ్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.  హాంకాంగ్‌ వీధుల్లోకి ఆదివారం నాడు దాదాపు 20 లక్షల మంది ఉప్పెనలా వచ్చారు. వారి నినాదాల్లో సముద్ర ఘోష వినిపించింది. అన్ని లక్షల మంది వీధుల్లోకి రావడం బహూశ అదే మొదటిసారి కావచ్చు. అసమ్మతి వాదులను చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకుంటున్నామని, ఈ ఏడాదికి ఇక ఈ బిల్లు లేనట్లేనని హాంకాంగ్‌ సీఈవో క్యారీ లామ్‌ శనివారం రాత్రే ప్రకటించినప్పటికీ ఆదివారం నాడు ప్రజలు ఇంతపెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడం విశేషం.

హాంకాంగ్‌ ప్రజల్లో క్రమశిక్షణ కొరవడిందంటూ క్యారీ లామ్‌ వ్యాఖ్యానించినందుకు సమాధానం అన్నట్లు అంతమంది జనం వీధుల్లోకి వచ్చారు. క్యారీ లామ్‌ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే అటుగా అంబులెన్స్‌ రావడంతో ప్రజాసమూహం నిలువునా చీలిపోతూ దానికి దారిచ్చింది. కొద్దిగా అటు, ఇటు కావొచ్చుగానీ హాంకాంగ్‌ ప్రజలు క్రమశిక్షణలేని వారేమీ కాదని మానవ హక్కుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కెన్నెత్‌ రోత్‌ వ్యాఖ్యానిస్తూ ఈ వీడియోను షేర్‌ చేశారు. అది చూస్తుంటే కేరళలోని పలక్కాడ్‌లో గత మార్చిలో వేడుకల్లో మునిగితేలుతున్న జనం అటుగా వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వైనం గుర్తుకురాక తప్పదు. ‘డూ యూ హియర్‌ ది పీపుల్‌ సింగ్, సింగింగ్‌ ది సాంగ్స్‌ ఆఫ్‌ ఆంగ్రీ మెన్, ఇటీ ఈజ్‌ ది మ్యూజిక్‌ ఆఫ్‌ ది పీపుల్, వూ విల్‌ నాట్‌ బి ది స్లేవ్స్‌ అగేన్‌’ అన్న ‘లెస్‌ మిసరబుల్‌’ హాలీవుడ్‌ చిత్రంలోని పాటను ఆలపిస్తూ ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేశారు.

మరిన్ని వార్తలు