హాంకాంగ్ లో మరో బుక్ సెల్లర్ అదృశ్యం..!

5 Jan, 2016 15:02 IST|Sakshi
హాంకాంగ్ లో మరో బుక్ సెల్లర్ అదృశ్యం..!

హాంకాంగ్ లో తాజాగా మరో బుక్ సెల్లర్ అదృశ్యమయ్యాడు. పుస్తకాలు తెచ్చేందుకు గోడౌన్ కు వెళ్ళిన అతడు.. తిరిగి రాకపోవడంతో ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. చైనా ప్రధాన భూభాగానికి చెందిన కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా పుస్తకాలను ప్రచురించే పబ్లిషింగ్ హౌస్ నుంచి ఇటీవలి కాలంలో ఒక్కొక్కరుగా మాయమౌతుండటం.. ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించేందుకు ప్రయత్నించిన 'మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్' కు ప్రస్తుతం ఈ చేదు అనుభవం ఎదురైంది.

మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అదృశ్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాక గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ వరుసగా వ్యక్తులు అదృశ్యం కావడం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో వ్యక్తి అదృశ్యంపై హాంకాంగ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ నిరసనలు వ్యక్తమౌతున్నాయి.  

కాస్ వే బే బుక్స్ షేర్ హోల్డర్... మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ ఉద్యోగి అయిన లీ బో... గత బుధవారంనుంచీ కనిపించడం లేదు. అతడు కంపెనీ వేర్ హౌస్ నుంచి పుస్తకాలు తెస్తానని చెప్పి వెళ్ళాడని, ఆ తర్వాత అతడి నుంచి తాను క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ కాల్ తప్పించి, మరే ఇతర సమాచారం లేదని అతడి భార్య చెప్తోంది. అతడు అదృశ్యమైన తర్వాత వచ్చిన ఫోన్ కాల్ షాంఘై నుంచి వచ్చిందని,  ఆ సమయంలో ఎప్పుడూ తాము మాట్లాడే కాంటనీస్ లో మాట్లాడకుండా... అతడు మాండరిన్ భాషలో మాట్లాడాడని ఆమె చెప్తోంది.  

అయితే ఇటీవలి కాలంలో పబ్లిషింగ్ హౌస్ నుంచి వ్యక్తులు అదృశ్యమౌతుండటం ఆందోళన కలిగిస్తోందని,  తాజాగా  ఐదో వ్యక్తి లీ కనిపించకుండా పోవడం అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసిందని, భయానికి కూడా గురి చేసిందని డెమొక్రటిక్ పార్టీ చట్ట సభ్యుడు ఆల్బర్ట్ హో అన్నారు. ప్రభుత్వ విచారణకోసం అతడిని చైనా ప్రధాన భూ భాగానికి అక్రమంగా తరలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తులకోసం పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు