కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు

30 Apr, 2020 11:23 IST|Sakshi

రెమెడిసివిర్‌  మందుతో రికవరీ వేగవంతం

త్వరగా కోలుకుంటున్న రోగులు

రెమెడిసివిర్‌ సామర్ద్యంపై అమెరికా శాస్త్రవేత్తల ప్రశంసలు

వాషిం​గ్టన్ : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ చికిత్సలో కీలక పురోగతి  సాధించామని అమెరికా శాస్త్రవేత్త  ఒకరు ప్రకటించారు. రికవరీ  శాతం బాగా పెరిగిందని , చాలా తక్కువ సమయంలో, అతివేగంగా రోగులు కోలుకున్నారని అమెరికా బుధవారం ప్రకటించింది. ప్రయోగాత్మక ఔషధం రెమెడిసివిర్ ద్వారా కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కొత్త అధ్యయనం ద్వారా తేలింది. దీనిద్వారా రోగులు కోలుకోవడానికి సగటున నాలుగు రోజులు  కంటే తక్కువ సమయం పడుతోందని ఈ స్టడీ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నఈ కరోనా వైరస్ కట్టడికి గిలియడ్ సైన్సెస్ కు  చెందిన రెమెడిసివిర్ కీలక విజయాన్నిసాధించిందని, ప్రత్యేకించి కరోనా నివారణకు టీకా అందుబాటులోకి తేవడానికి కనీస ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమేపడుతుందన్నఅంచనాల మధ్య ఇది కీలక విజయమని  అమెరికా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!) (కోవిడ్-19 : యాంటీ వైరల్‌ ట్యాబ్లెట్ల మార్కెట్‌)

యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా (యుఎస్, యూరప్ , ఆసియా) 68 ప్రదేశాలలో  1,063 మంది ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ రోగులలో యాంటీవైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మంచి ఫలితాలనిచ్చిందని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. రోగులు కోలుకునే సమయాన్ని 31శాతం తగ్గించిందనీ, సగటున 11 రోజుల్లో వ్యాధి నయమైందని చెప్పారు. రెమెడిసివిర్‌ ఉపయోగంతో మరణించే వారి సంఖ్య బాగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. 

పూర్తి ఫలితాలను మెడికల్ జర్నల్‌లో త్వరలోనే ప్రచురిస్తామని ఫౌసీ అన్నారు. ఎక్కువమంది వ్యక్తులు, ఎక్కువ కంపెనీలు, ఎక్కువ పరిశోధకులు పాల్గొనడం వల్ల ఇది మరింత మెరుగవుతుందని తెలిపారు రెమెడిసివిర్ ఔషధంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని ఫౌసీ ధీమా వ్యక్తం చేశారు.రికవరీకి సమయంతగ్గించడంలో స్పష్టమైన, ముఖ్యమైన, సానుకూల ప్రభావాన్ని కలిగి ఉందని డేటా ద్వారా తెలుస్తోందన్నారు. అంతేకాదు 1980లో హెచ్ఐవీ కి మందు కనుగొన్ప్పటి విజయంతో దీన్ని ఫౌసీ పోల్చారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, కాలిఫోర్నియాకు చెందిన ప్రపంచ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తో సంప్రదింపులు జరుపుతోంది. రోగులకు సాధ్యమైనంత త్వరగా, తగిన విధంగా అందుబాటులో ఉంచడంపై మాట్లాడుతోంది. అత్యవసర వినియోగ అధికారాన్ని ప్రకటించాలని ఎఫ్డీఏ యోచిస్తోందని సీనియర్ అధికారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. మరోవైపు ఒక నిపుణుడుగా తాజా ఫలితాలపై సంతోషంగా, ఆశాజనకంగా  ఉన్నామని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం  వైద్య నిపుణుడు మార్క్ డెనిసన్ చెప్పారు. తమ ల్యాబ్ లో ఈ వైరస్  నివారణకు సంబంధించి 2013 లో  రెమె‌డెసివిర్ సామర్థ్యాన్ని పరీక్షించామని, అప్పటినుంచి చాలా పరిశోధనలు చేశామని తెలిపారు. కానీ ఎన్ఐహెచ్  అధ్యయనంలో పాల్గొనలేదన్నారు.  (కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు)

కరోనావైరస్ నిరోధానికి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న పరీక్షిస్తున్న అనేక చికిత్సలలో గిలియడ్కు చెందిన రెమెడిసివిర్ ఒకటి. దీన్ని ఇప్పటికే  చైనాలో ఉపయోగించినా, ఫలితాలు పెద్దగా ఆశాజనంగా లేవని గతంలో అధ్యయనాలు తెలిపాయి. అలాగే గిలియడ్ మొదట ఎబోలాకు మందుగా రెబోడెసివిర్‌ను అభివృద్ధి చేసింది. కానీ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఇంట్రావీనస్ ఔషధం అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాధిని  జంతువుల్లో నివారించడంలో సహాయపడింది. వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించింది. కానీ ప్రపంచంలో ఎక్కడా ఉపయోగానికి ఆమోదం లభించలేదు.

మరిన్ని వార్తలు