యెమెన్‌ రక్తసిక్తం

20 Jan, 2020 01:39 IST|Sakshi

డ్రోన్‌ దాడిలో 83 మంది సైనికులు మృతి

దుబాయ్‌: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌ మరోసారి రక్తమోడింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా జరిగిన డ్రోన్‌ క్షిపణి దాడిలో 80 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు హుతి తిరుగుబాటుదారులే కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్‌ ప్రావిన్సు సైనిక శిబిరంలోని మసీదులో శనివారం సైనికులంతా ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఘటనలో 83 మంది సైనికులు చనిపోగా 148 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, నిహ్మ్‌ ప్రాంతంలో జరిపిన సైనిక చర్యలో పెద్ద సంఖ్యలో హుతిలను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా హుతి తిరుగుబాటుదారులకు ఇరాన్‌ సహకారం అందిస్తోంది. తాజా ఘటనపై హుతి తిరుగుబాటు నేతలు స్పందించలేదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కీలకమైన హొడైడా నౌకాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం నుంచి వైదొలిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఒప్పందంలోని అంశాల అమలు నత్తనడకన సాగుతుండటంతో శాంతిస్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలో వేలాది మంది చనిపోగా లక్షలాదిగా జనం నిరాశ్రయులయ్యారు.  దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది.

మరిన్ని వార్తలు