చనిపోయిన వాళ్లు నిజంగా బతికొస్తే....?

6 Jan, 2016 12:17 IST|Sakshi
చనిపోయిన వాళ్లు నిజంగా బతికొస్తే....?

మాస్కో: చనిపోయిన వారు మళ్లీ బతికొస్తారా? మనతోపాటు మన ఇంట్లో ఒక సభ్యుల్లా బతికిన కుక్క, పిల్లి కూడా మనలాగే బతికొస్తే...? సైన్స్ ఫిక్షన్ అంటారు. అవును ప్రస్తుతానికి ఇది సైన్స్ ఫిక్షనే. మరో 40, 50 ఏళ్లలో ఇది నిజం కాబోతోందని ఆధునిక సైన్స్ చెబుతోంది. మరి అన్నేళ్లు మృతదేహాలు కుళ్లిపోకుండా నిద్రపోయినట్లుగానే ఎలా ఉంటాయి? అందుకే క్రయోనిక్స్ సంస్థలు ప్రపంచంలోని పలు చోట్ల వెలిశాయి. మానవ మృతదేహాలు, వాటిలోని అవయవాలను ఏమాత్రం దెబ్బతినకుండా అతిశీతలంలో భద్రపర్చడాన్నే క్రయోనిక్స్ అంటారు. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి రెండు సంస్థలు ఉండగా, రష్యాలో ఒకటి ఉంది. రష్యాలో 2005లోనే క్రయోనిక్స్ సంస్థను స్థాపించగా అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది.

 ఓ రష్యా శాస్త్రవేత్త కుమారుడైన 35 ఏళ్ల దనిలా మెద్వెదెవ్ ల్యాబ్ లాంటి ‘క్రియోరస్’ సంస్థను నిర్వహిస్తున్నారు. మాస్కో శివారులోని సెర్గీవ్ పొసద్ పట్టణంలో ఈ సంస్థ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలెవరికీ తెలియదు. అప్పుడప్పుడు ఆధునిక అంబులెన్స్ వాహనాలు గ్రీన్ గేట్ గుండా లోపలకి వెళ్లడం మాత్రం కనిపిస్తుంది. అందులో ప్రస్తుతం 9 దేశాలకు చెందిన 24 మానవ మృతదేహాలను, 21 మనుషుల తలలను భద్రపరుస్తున్నారు. కుక్కలు, పిల్లుల శవాలు కూడా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయట.  జబ్బుల కారణంగానో, ప్రమాదాల కారణంగానో ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేశాలను కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి ఈ ఆస్పత్రి ల్యాబ్‌కు తరలిస్తారు. శీతలీకరణలో మృతదేహంలోని రక్తకణాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాత రక్తాన్ని కొంతతీసి రసాయనాలతో మిశ్రమం చేసిన కొత్త రక్తాని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలన్ని లేదంటే తలలను మైనస్ 196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.

 ఇదేమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారమేమి కాదు. కార్పొరేట్ కల్చర్‌గా కొనసాగుతున్న వ్యాపారం. మొత్తం మృదదేహాన్ని భద్రపర్చేందుకు 24 లక్షల రూపాయలు, ఒక తలను భద్రపర్చేందుకు 8 లక్షల రూపాయలను వసూలు చేస్తారు. తలను భద్రపర్చినట్టయితే మెదడు భద్రంగా ఉంటుందని, భవిష్యత్తులో తలను రక్షించుకుంటే దాన్ని తగిలించుకునేందుకు సరైన బాడీ దొరక్కపోతుందా ? అన్న ఆశాభావం కొందరిదైతే, తలను మాత్రమే భద్రపరిస్తే తక్కువ ఖర్చవుతుందన్నది మరి కొందరి కస్టమర్ల భావన. అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్స్ సంస్థ కోర్టు కేసుల కారణంగా దివాలాతీసి మూతపడగా, ఆరిజోనాలోని అల్కార్ ఇనిస్టిట్యూట్ మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. అందులో ప్రముఖ బేస్‌బాల్ స్టార్ టెడ్ విలియమ్స్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. మృతదేహాల వివరాలు బహిర్గతం చేయరాదన్నది సంస్థ నియమం.

 ఈ అల్కార్‌లో మానవ మృతదేహాలను భద్రపర్చడం రష్యా సంస్థకన్నా మరింత కాస్లీ వ్యవహారం. ఇందులో ఒక్క మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 1.33 కోట్ల రూపాయలను, తలకు 53 లక్షలను వసూలు చేస్తున్నారు. ఈ సంస్థకు బతికున్న సభ్యులు కూడా దాదాపు 1100 మంది ఉన్నారు. భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవడం లాంటిది. చనిపోయిన వారిని లేదా క్లినికల్ డెడ్ అని ప్రకటించిన వారిని కొన్ని గంటల్లోనే భద్రపరిస్తే మళ్లీ భవిష్యత్తులో ప్రాణం పోయవచ్చన్నది మిచిగాన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన రాబర్ట్ ఎటింగ్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ప్రాతిపదికనే ఇలాంటి క్రయోనిక్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. చైనాలో కూడా జాయింట్ వెంచర్‌గా క్రయోనిక్స్ భారీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా, స్విడ్జర్లాండ్‌లో కూడా మరోటి వెలుస్తోంది. ఆరిజోనాలోని ఆల్కార్ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు వివిధ ఆస్పత్రులతోని, మార్చురీలతోని టైఅప్‌లు పెట్టుకోగా రష్యా సంస్థ ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం కొన ఊపిరితోనున్న వాళ్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఏకంగా అనుబంధ ఆస్పత్రినే ఏర్పాటు చేస్తోంది.

ఈ క్రయోనిక్స్ సంస్థల పరిభాష కూడా భిన్నంగా ఉంటుంది. మృతదేహాలను పేషంట్స్‌గా వ్యవహరిస్తారు. శీతలీకరణ చేయడాన్ని నిశ్చల స్థితి అని పిలుస్తారు. తిరిగి ప్రాణం తెప్పించే ప్రక్రియను రీయానిమేషన్ అని అంటారు.

మరిన్ని వార్తలు